సొంతమంత్రులు, ఎంఎల్ఏల మీదే రేవంత్ అసంతృప్తి
ప్రభుత్వం తరపున చాలామంది స్పందించటంలేదు కాబట్టే ప్రతిపక్షాల ప్రతి ఆరోపణ, విమర్శకు తానే స్పందించాల్సొస్తున్నట్లు రేవంత్ వాపోయారు;
రేవంత్ చేసిన తాజా వ్యాఖ్యలు విన్నవారికి ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు అసెంబ్లీ కమిటీహాలులో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్(Revanth) మాట్లాడుతు మంత్రులు, ఎంఎల్ఏలపై ఫుల్లుగా ఫైరయ్యారు. కారణం ఏమిటంటే ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు తాను మాత్రమే కౌంటర్లు ఇవ్వాల్సొస్తోందని. ప్రతిపక్షాల నేతలు తనపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలను మంత్రులు, ఎంఎల్ఏలు, చీఫ్ విప్పుతో పాటు విప్పులు అసలు గమనిస్తున్నారా అని నిలదీశారు.
ప్రతిపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు మంత్రులు, ఎంఎల్ఏలు, విప్పులు, చీఫ్ విప్పు ఎందుకు స్పందించటంలేదని మండిపోయారు. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు ధీటుగా మంత్రులు, ఎంఎల్ఏలు, చీఫ్ విప్పు, విప్పులు స్పందిస్తే తాను స్పందించాల్సిన అవసరం ఎందుకొస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున చాలామంది స్పందించటంలేదు కాబట్టే ప్రతిపక్షాల ప్రతి ఆరోపణ, విమర్శకు తానే స్పందించాల్సొస్తున్నట్లు రేవంత్ వాపోయారు. ఇకనుండి ఇలాంటి పరిస్ధితి ఉండకూడదని, ప్రతిపక్షాల ఆరోపణలకు ధీటుగా మంత్రులు, ఎంఎల్ఏలు స్పందించాల్సిందే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
రేవంత్ ఆవేధనలో వాస్తవం ఉన్నది. ఎలాగంటే ప్రతిరోజు ప్రభుత్వాన్ని, వ్యక్తిగతంగా రేవంత్ ఇమేజిని డ్యామేజ్ చేయటమే పనిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీమంత్రి హరీష్ రావు(Harish Rao), ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) టైంటేబుల్ వేసుకున్నట్లుగా ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. పదేళ్ళ తమ హయాంలో జరిగిన తప్పులను కూడా వీళ్ళు ఇపుడు రేవంత్ ఖాతాలో వేసి వాయించేస్తున్నారు. సొంత మీడియాతో పాటు పదులు, వందల సంఖ్యలో యూబ్యూట్ ఛానళ్ళు(You Tube Channels) పెట్టుకుని రేవంత్ ను ఒక ఆటాడుకుంటున్నారు. తాజాగా యూట్యూబర్ పొగడదండ రేవతి రైతు ముసుగులో రేవంత్ ను బండబూతులు తిట్టించి, ఆ వీడియోను వైరల్ చేయటం ఇందులో భాగమే.
వందలు, వేల సోషల్ మీడియా ఖాతాలను(BRS Social media) రెడీ చేసుకుని ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు పెద్ద సైబర్ యుద్ధమే చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతోందంటే చేసిన పనులకు, అమలుచేస్తున్న పథకాలకు రేవంత్ ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజీ రాకపోగా డీఫేమ్ అవుతోంది. కారణం ఏమిటంటే బీఆర్ఎస్ చేస్తున్న సోషల్ మీడియా యుద్ధాన్ని కాంగ్రెస్(Telangana Congress) సమర్ధవంతంగా తిప్పకొట్టలేకపోతోందన్నది వాస్తవం. దీంతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ చల్లుతున్న బురదే ప్రతిరోజు జనాల్లో బాగా హైలైట్ అవుతోంది. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పటం రేవంత్ వల్ల కావటంలేదు. దీంతో ఏమవుతుందోంటే బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపైనే జనాల్లో బాగా చర్చ జరుగుతోంది. ఈ విషయంలోనే రేవంత్ కు బాగా మండినట్లుంది.
రేవంత్ ఉద్దేశ్యం ఏమిటంటే ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రులు, ఎంఎల్ఏలు ఎప్పటికప్పుడు స్పందించి తగిన రీతిలో సమాధానాలు ఇచ్చి, కౌంటర్ ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోవాలని. కాని మంత్రులు, ఎంఎల్ఏల్లో చాలామంది అసలు బీఆర్ఎస్ ఆరోపణలు, విమర్శలను పట్టించుకోవటంలేదు. ఎవరి సొంత వ్యాపాకాల్లో వాళ్ళు బిజీగా ఉన్నపుడు ఇక రేవంత్ గురించి ఎక్కడ పట్టించుకుంటారు. ఇదేసమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున సోషల్ మీడియా నిర్వహిస్తున్న నేతలు కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటంలేదు. అందుకనే రేవంత్ కు మండిపోయి హోలుమొత్తంమీద మంత్రులు, ఎంఎల్ఏలకు ఫుల్లు క్లాసు తీసుకున్నారు. మరి క్లాసు ప్రభావం ఎలాగ పనిచేస్తుందో చూడాలి.