ఏపీలో ఆ నాలుగు టీవీ చానల్స్‌పై ఆంక్షలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు అయ్యేంత వరకు కవరేజీ నుంచి వీటిని నిషేధించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.;

By :  Admin
Update: 2025-02-24 06:29 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కొన్ని మీడియా చానల్స్‌ను నిషేధించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల కవరేజీ విషయంలో ఆ నాలుగు టీవీ చానల్స్‌ను దూరంగా ఉంచుతూ ఆంక్షలు విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన టీవీ చానల్స్‌ అయిన టీవీ 9, ఎన్టీవీ, సాక్షితో పాటు 10టీవీని కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యేంత వరకు వీటిపైన నిషేధం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నాలుగు టీవీ చానల్స్‌ను అసెంబ్లీ కవరేజీ నుంచి నిషేధిస్తున్నట్లు ఆయా చానల్స్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. నోటీసులు ఇవ్వకుండానే ఎలా ఆంక్షలు విధిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.

మరో వైపు మీడియా చానల్స్‌పై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి సంఘటనలో చోటు చేసుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తమకు అనుకూలమైన టీవీ చానల్స్‌కు ప్రేయారిటీ ఇస్తూ.. తక్కిన టీవీ చానల్స్‌పై పక్షపాత ధోరణితో వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఆంక్షలు విధించి మీడియా స్వేచ్ఛను హరించేందుకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప<భుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీకి రెడ్‌బుక్‌ రాజ్యాంగం పాకిందని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీ చానల్స్‌ కానీ పత్రికలు కానీ ఆయా పార్టీలకు అనుకూలంగా పని చేస్తున్నాయనే ముద్ర ఎప్పటి నుంచో ఉంది. ఈటీవీతో పాటు ఈనాడు, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి టీవీ చానల్‌తో పాటు ఆంధ్రజ్యోతి పత్రిక, టీవీ 5 వంటి మీడియా గ్రూపులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ నేతలు పలు మార్లు బహిరంగంగానే విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎస్‌ ఆంధ్రజ్యోతిల గురించి అసెంబ్లీలోనే ప్రస్తావించారు. ఇవి తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా సంస్థలుగా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదేరకమైన విమర్శలు గుప్పించారు.
సాక్షి టీడీ కానీ, సాక్షి పత్రిక కానీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం, వైఎస్‌ జగన్‌కోసం పని చేస్తుందనేది అందరికి తెలిసిన రహస్యం. వాటికి ఓనర్లు, అధిపతులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య వైఎస్‌ భారతిరెడ్డిలే కాబట్టి వారి కోసమే ఏర్పాటు చేసుకున్న మీడియా సంస్థలుగా ముద్రపడ్డాయి. తక్కిన టీవీ చానల్స్‌కు రాష్ట్రం విడిపోయిన తర్వాత పార్టీ ముద్ర పడిందనే చర్చ కూడా ఉంది. 2019లో అధికారం చేపట్టి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీవీ9, ఎన్టీవీ, 10 టీవీలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోసం పని చేస్తున్నాయని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దీంతో ఆ టీవీ చానల్స్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకు మద్దతిచ్చే చానల్స్‌గా ముద్రపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల కవరేజీకి టీవీ9, ఎన్టీవీ, 10టీవీతో పాటు సాక్షి టీవీలను నిషేధించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూటమి శ్రేణులు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News