ఏపీలో కరువుపై నివేదిక..కేంద్రం సాయం చేస్తుందా

కేంద్ర బృందానికి ఆంధ్రప్రదేశ్‌లో కరువు పరిస్థితులపై రూపొందించిన నివేదికను సమర్పించిన సిసోడియా.;

By :  Admin
Update: 2025-01-09 12:04 GMT


ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌–24 కరువు పరిస్థితులపై అధికారులు రూపొందించిన సమగ్రమైన నివేదికను కేంద్ర బృందానికి సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ కరువు బృందంతో ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా గురువారం సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరువు పరస్థితులను ఆయన కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం ఏపీలో కరువు పరిస్థితులపై రూపొందించిన నివేదికను వారికి అందజేశారు. ఖరీఫ్‌–24 సీజన్‌లో నష్ట పోయిన వివిధ పంటల వివాలను నివేదికలో పొందు పరిచారు. ఆంధ్రప్రదేశ్‌లో కరువు వల్ల నష్ట పోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర బృందాన్ని సిసోడియా కోరారు. రైతులను ఆదుకోవడంలో ఉదారంగా స్పందించాలని, సత్వర సాయం కోసం రూ. 151.77 కోట్లు సాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ పరిధిలో రూ. 90.62 కోట్లు, రూరల్‌ వాటర్‌ సప్లై కింద రూ. 0.78 కోట్లు, అర్భన్‌ వాటర్‌ సప్లై పరిధిలో రూ. 4.89 కోట్లు, పశుసంవర్థక శాఖ కింద రూ. 55.47 కోట్ల నష్టం వాటిల్లిందని, ఆ మేరకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం కావాలని కేంద్ర బృందాన్ని సిసోడియా కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో 27 తీవ్ర కరువు మండలాలు, 27 మధ్యస్థ కరువు మండలాలుగా గుర్తించినట్లు వారికి వివరించారు. అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 16, శ్రీ సత్యసాయి జిల్లాలో 10, అనంతపురం జిల్లాలో 7, కర్నూలు జిల్లాలో 2 మండలాలు ఉన్నాయి. రూ. 16.67 కోట్ల వ్యయంతో సుమారు లక్ష మంది రైతులకు దాదాపు 80 శాతం సబ్సిడీపైన విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర బృందానికి తెలిపారు. మరో రూ. 55.47 కోట్లతో 60 శాతం సబ్సిడీ కింద పశుగ్రాసం, పశుగ్రాస విత్తనాల సరఫరా చేస్తున్నామని, మరో 40 శాతం సబ్సిడీ కింద చాఫ్‌ కటర్లు, మందుల సరఫరాలు చేస్తున్నట్లు కేంద్ర బృందానికి వివరించారు. ఏపీలో నెలకొన్న ఖరీఫ్‌–24 సీజన్‌ కరువు పరిస్థితులపై అధ్యాయనం చేసేందకు ఢిల్లీ నుంచి కేంద్ర బృందం మూడు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్‌ సెక్రెటరీ పెరిన్‌ దేవీ నేతృత్వంలో మూడు బృందాలు పర్యటనలు చేపట్టారు. గత రెండు రోజులుగా కేంద్ర బృందం ఏపీలోని కరువు ప్రాంతాలను పరిశీలించారు. అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించి, వివిధ రకాల పంటలను పరిశీలించారు. గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడుతో ఈ బృందం సమావేశం కావలసి ఉంది.
అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కరువు సాయం అందుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో విజయవాడ వరదల సాయం కోరినా కేంద్రం స్పందించింది లేదు. సాయం చేసింది లేదు. మరో వైపు కేంద్రంలో సీఎం చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. ఎన్డీఏలో కీలక రోల్‌ పోషిస్తున్నారు. ఢిల్లీలోను, ఏపీలోను ఎన్డీఏ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం, ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌లో కరువు పరిస్థితులపై ఏ మేరకు స్పందిస్తారు? ఎంత వరకు సహాయం చేస్తారనేది వేచి చూడాలి.
Tags:    

Similar News