సీనియర్ ఐపీఎస్‌లకు ఊరట..ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సినీ నటి కేసులో కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలు సస్పెన్షన్‌లో ఉన్నారు.;
By : The Federal
Update: 2025-05-08 08:43 GMT
ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అదే కేసులో సస్పెన్షన్‌కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఈ ఇద్దరి ఐపీఎస్‌లో పాటు ఇదే కేసులో సస్పెండ్ అయిన ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలకు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరటనిచ్చింది. కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలపై సిట్ అధికారుల తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటుగా క్వాష్ పిటీషన్లకు సంబందించిన తుది విచారణను జూన్ 30 నాటికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానీ కేసును తెరపైకి తెచ్చారు. ఈ కేసులో సినీ నటి జెత్వానీని ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలకు సంబంధించి ఐడీ ర్యాంకులో ఉన్న కాంతిరాణ టాటాను, డీఐజీ ర్యాంకులో ఉన్న విశాల్ గున్నీని, ఏసీపీ హనమంతరావును, సీఐ సత్యనారాయణలపై కేసు నమోదు చేయడంతో పాటు సర్వీసు నుంచి వీరికి సస్పెండ్ చేసింది.
అయితే తాజాగా డీజీపీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ పీఎస్‌ఆర్ అంజనేయులును ఇదే కేసులో అరెస్టు చేసి విచారణ చేపట్టిన సిట్ అధికారులు, ఆంజనేయులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు మరో సారి విచారణకు రావాలని ఈ నలుగురికి నోటీసులు జారీ చేశారు. మే 5న విచారణకు హాజరు కావాలసి ఉంటుందని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన గురువారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీరిపైన సిట్ అధికారుల తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.