ఏపీలో స్టార్‌ హోటళ్ల బార్‌ లైసెన్స్‌ ఫీజుల కుదింపు

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం మంత్రి వర్గ సమావేశం జరిగింది.;

By :  Admin
Update: 2025-04-03 12:28 GMT

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం అమరావతి సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో పాటు మంత్రులు అందరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాల మీద చర్చించిన కేబినెట్‌ కీలక అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ డ్రోన్‌ కార్పొరేషన్‌ అందులో ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్‌ డ్రోన్‌ కార్పొరేషన్‌(ఏపీడీసీ)ను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) నుంచి వేరు చేసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్‌ సంబంధిత అంశాలన్నింటికీ ఆంధ్రప్రదేశ్‌ డ్రోన్‌ కార్పొరేషనే నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఆ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు స్టార్‌ హోటళ్లల్లో బార్‌ లైసెన్స్‌ల ఫీజులు వంటి పలు కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకున్నారు.

అనకాపల్లి జిల్లాలోని డీఎల్‌పురం వద్ద కేపిటివ్‌ పోర్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం ఆమోద ముద్ర వేసింది. హోటళ్ల మీద చర్చించిన మంత్రి వర్గం స్టార్‌ హోటళ్ల ఫీజుల మీద ఓ నిర్ణయానికి వచ్చింది. త్రీ స్టార్‌ హోటళ్లు, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు బార్‌ లైసెన్స్‌ల ఫీజులను కుదింపునకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ స్టార్‌ హోటళ్లల్లో బార్‌ లైసెన్స్‌ల ఫీజులను రూ. 25లక్షలకు కుదించాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. యువజన, పర్యాటక శాఖ ప్రభుత్వ ఉత్తర్వుల ర్యాటిఫికేషన్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ. 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలనే ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ మీడియా అక్రిడిటేషన్‌ నిబందనలు–2025కి ఆమోదం తెలిపింది. నాగార్జునసాగర్‌ లెఫ్ట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ రీటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జలహారతి కార్పొరేషన్‌ ద్వారా పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయాలనే ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు 
మెస్సర్స్‌ ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ దాదాపు ఒక లక్షా 35 వేల కోట్ల పెట్టు బడితో రెండు దశల్లో 17.8 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి చేసే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. ఇందుకై వారు కోరిన విధంగా అనకాపల్లి జిల్లాలోని డిఎల్‌ పురం వద్ద 2.9 కిమీల వాటర్‌ ఫ్రంట్‌తో ఒక క్యాప్టివ్‌ పోర్టు ఏర్పాటుకై ఆమోదం తెలిపింది. అయితే ఈ క్యాప్టివ్‌ పోర్టు అనుమతికై కాకినాడ గేట్వే పోర్టు లిమిటెడ్‌ (కెజిపిఎల్‌)కు సంబందించిన పోర్టు రాయితీ ఒప్పందంలోని క్లాజు నెం.30.1.1 (ఇండియన్‌ పోర్టు యాక్టు–1908) ను సవరించడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా మొదటి దశలో ఏడాదికి 7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల స్టీల్‌ ప్లాంట్‌ను రూ.55,964 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబడుతుంది. జనవరి 2029 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యాన్ని నిర్థేశించడం జరిగింది. మొదటి దశలో దాదాపు 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. అదే విధంగా ఏడాదికి 10.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల రెండో దశ స్టీల్‌ ప్లాంట్‌ను రూ.80 వేల కోట్ల పెట్టుబడితో 2033 కి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్థేశించడం జరిగింది. రెండో దశలో దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి.
అదే విధంగా మొదటి దశలో ఏర్పాటయ్యే ఈ ఉక్కు పరిశ్రమకు అనుసంధానంగా 20.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల క్యాప్టివ్‌ పోర్టును రూ.5,816 కోట్లు వ్యయంతో జనవరి 2029 కల్లా ఏర్పాటు చేయబడుతుంది. దీని ద్వారా 1,000 మందికి ఉద్యోగాలు కల్పించబడతాయి. అదే విధంగా ఏడాదికి 10.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల రెండో దశ స్టీల్‌ ప్లాంట్‌ అనుసంధానంగా రెండో దశ క్యాప్టివ్‌ పోర్టు ను రూ.5,380 కోట్లు వ్యయంతో జనవరి 2029 కల్లా ఏర్పాటు చేయబడుతుంది. దీని ద్వారా 5,000 మందికి ఉద్యోగాలు కల్పించబడతాయి. ఈ ప్రాజక్టు నిర్మాణంలో ఎటు వంటి అడ్డంకులు లేకుండా నిర్థేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు
కూటమి ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్ను ప్రైవేటు పరంకాకుండా చూడటమే కాకుండా, కరెంటు బిల్లు రూ.2,400 కోట్లను ఈక్విటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. ఫలితంగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ మార్చి మాసంలో లాభాలను ఆర్జించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పోలిసింగ్‌ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ పోలీసులను అక్కడ సెక్యురిటీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో తీరప్రాంతం అభివృద్దిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది, అవకాశం ఉన్న చోట పోర్టులు, ఫిషింగ్‌ హర్బర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగింది.
రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాన్ని అభివృద్ది పర్చడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని వృద్ది చేయడమే కాకుండా ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున మెరుగు పర్చవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రంగం అభివృద్దిపై దృష్టి సారించారు. టెంపుల్‌ టూరిజంకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. పర్యాటకులకు సరిపడా రూములు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ ఐదేళ్లలో దాదాపు 50,000 రూములను నిర్మించాలని లక్ష్యంతో పర్యాటక శాఖ ఉంది.
ఫలితంగా రాష్ట్రంలోని 3 స్టార్‌ – అంతకంటే ఎక్కువ కేటగిరీ హోటళ్లకు బార్‌ లైసెన్స్‌ ఫీజును రూ.66 లక్షల నుండి రూ. 25 లక్షలకు తగ్గించడానికి ఆమోదం కోసం యువజన సర్వీసులు, పర్యాటక, శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని ఆతిథ్య రంగాభివృద్దికి తగిన అనుకూల వాతావరణాన్ని కల్పించడమవుతుంది. ఆతిథ్య పర్యాటక రంగం ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ది చెందడానికి ఊతం ఇస్తూ తద్వారా ఆర్థికాభివృద్దిని సాదించడంతో పాటు మరిన్ని ఉద్యోగ అవకాశలు కల్పించబడతాయి. హడ్కో నుండి ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రూ.710 కోట్ల మేర ఋణాన్ని తీసుకునేందుకు ప్రభుత్వ హామీ అందించడానికి గత మార్చి మాసంలో జారీ చేయబడిన ఉత్తర్వులను (ర్యాటిఫికేషన్‌)ఆమోదించేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ కాంట్రాక్టు విషయంలో గత ప్రభుత్వ అనుసరించిన విధానం వల్ల ఎన్‌ఈసీఎల్, ఏపీ జెన్‌కోలకు వాటిల్లిన దాదాపు రూ.1735.35 కోట్ల నష్టాన్ని భర్తీ చేసేందుకు తేదీ:08.12.2024 న జారీ చేసిన ఆర్బిట్రేషన్‌ అవార్డు అమలుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని వల్ల ఎన్‌ఈసీఎల్‌కు రూ.742 కోట్లు, ఏపీజెన్‌కోకు రూ.986.17 కోట్ల మేర నష్టాన్ని భర్తీ చేయడం జరుగుతుంది. చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ద్వారా నాగార్జున సాగర్‌ ఎడమ బ్రాంచ్‌ కెనాల్‌ వేంపాడు మేజర్‌లో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి రూ:44,60,15,795 అదనపు ఆర్థిక సాయం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు.
గోదావరి నది వరద జలాలను, ఇతర ప్రాజెక్టులను ఉపయోగించుకునేందుకు నిర్థేశించబడిన ‘పోలవరం – బనకచెర్ల లింక్‌ ప్రాజెక్ట్‌‘ పనులను అమలు చేయడానికి, పూర్తి చేయడానికి, కంపెనీల చట్టం, 2013 ప్రకారం 100% ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీగా జల వనరుల శాఖ ‘జల హారతి కార్పొరేషన్‌‘ పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటుకు చేసేందుకు, దానికి అవసరమైన డైరెక్టర్లు, ఇతర సిబ్బందిని సమకూర్చుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు ఖర్చుఅవుతాయనే అంచనా వేయడం జరిగింది. జర్నలిస్టులకు అక్రిటేషన్లు జారీచేసే విషయంలో రూపొందించబడిన నూతన సమగ్ర నియమ నిబంధనల పాలసీని ఒక సారి సమగ్రంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాల అభివృద్దికి, నిరుపేదల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై ఒక రోడ్‌ మ్యాప్‌ రూపొదించేందుకు రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారులు గ్రామాల్లో మూడు రోజులు, రెండు రాత్రులు బసచేసే కార్యక్రమాన్ని త్వరలోనే రూపొందించడం జరుగుతుందని మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు. 
Tags:    

Similar News