పురుడు పోసుకుంటున్న అమరావతి -2
అమరావతి సచివాలయం ప్రసవ వేదన నుంచి బయట పడింది. పనులు వేగం పుంజుకున్నాయి.;
అమరావతి రెండో దశ సచివాలయ నిర్మాణం మొదలైంది. రూ. 4,688 కోట్లతో సచివాలయ టవర్ల నిర్మాణం, రూ. 2,791.31 కోట్లతో ఇతర మౌలిక సదుపాయాల టెండర్లు, మొత్తంగా రూ. 45,249.24 కోట్ల విలువైన పనుల ఆమోదం పొందాయి. ఏపీ ప్రభుత్వం ఈ పనులు వెంటనే మొదలు పెట్టాలని కాంట్రాక్ట్ సంస్థలను ఆదేశించింది సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీ మద్దతుతో అమరావతి ప్రపంచంలోని ఉత్తమ నగరాలలో ఒకటిగా రూపొందేందుకు నిర్ణయించారు.
2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సుమారు 34,000 ఎకరాల భూమిని సేకరించి, రాజధాని నిర్మాణానికి రూ. 43,000 కోట్ల విలువైన టెండర్లు పిలిచింది. అయితే 2019-24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ పనులు ఆగిపోయాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు మళ్లీ వేగవంతం అయ్యాయి. రెండో దశ సచివాలయ నిర్మాణం మొదలైంది.
సచివాలయ నిర్మాణ పనులు
రెండో దశ సచివాలయ నిర్మాణ పనులు 2025 మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభ మయ్యాయి. ఈ కార్యక్రమం అమరావతిలో జరిగిన బహిరంగ సభలో భాగంగా సుమారు 5 లక్షల మంది ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
టెండర్ వివరాలు
సచివాలయం జీఏడీ (పరిపాలన) భవనం నిర్మాణం కోసం షాపూర్జీ పల్లోంజీ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టు తీసుకుంది. ఈ భవనం 17.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 47 అంతస్తులతో నిర్మించబడుతుంది. మొత్తం సచివాలయం సహా ఐదు టవర్ల నిర్మాణానికి రూ. 4,688 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ పనులు రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అదనంగా అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) రూ. 2,791.31 కోట్ల విలువైన 8 టెండర్లను జారీ చేసింది. ఇందులో రోడ్ల నిర్మాణం, వరదనీటి కాల్వల మళ్లింపు, తాగునీటి సరఫరా నెట్‌వర్క్, డ్రైనేజీ నెట్‌వర్క్, నడకదారులు, సైకిల్ ట్రాక్‌లు వంటివి ఉన్నాయి.
రెండో దశలో తొలి అడుగు
సచివాలయ నిర్మాణ స్థలంలోని లోపలి భాగంలో ఉన్న నీటిని తొలగించి పనులు ప్రారంభించారు. షాపూర్జీ పల్లోంజీ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ మొత్తం సచివాలయ భవన నిర్మాణ బాధ్యతను తీసుకోగా, నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌సీసీ), లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) వివిధ విభాగాలలో పనులను చేపట్టాయి. ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని గ్లోబల్ గ్రీన్ సిటీగా తీర్చి దిద్దుతామంటున్నారు. మూడేళ్లలో సచివాలయం సహా రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేసి, ఘనంగా ప్రారంభోత్సవాలు నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణను ఆదేశించారు. ‘అమరావతి ఒక నగరం కాదు, ఒక అధునాతన శక్తిగా మారుతుంది. రాష్ట్ర వృద్ధిరేటుకు ఇది కేంద్రంగా నిలుస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ రుణాల సహాయంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం, గ్లోబల్ లీడర్‌షిప్ కేంద్రాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు అమరావతిలో ముఖ్యమైనవి. పూర్తి వీడియో స్టోరీ ఇక్కడ అందు బాటులో ఉంది.