కృష్ణా యాజమాన్య బోర్డు విషయంలోనూ రాయలసీమకు అన్యాయం

రాయలసీమ అభివృద్దిపై పాలకులకు చిత్తశుద్ధి లేదు. అందుకే రాయలసీమ వెనుకబడింది.;

Update: 2025-01-22 12:31 GMT

కృష్ణానదీ యాజమాన్య బోర్డు ను రాయలసీమలో ఏర్పాటు చేయకుండా రాయలసీమకు అన్యాయం చేశారని జగన్, చంద్రబాబులపై రాజ్య సభ మాజీ సభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే..

ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం లో సెక్షన్ 85, సబ్ సెక్షన్ (1), (2) ప్రకారం రాష్ర్ట విభజన జరిగిన 60 రోజుల లోపులో కేంద్ర ప్రభుత్వం గోదావరీ నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తెలంగాణాలో, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటు చేయాలి. కానీ దురదృష్ట వశాత్తూ 10 సంవత్సరాల 7 నెలలు అయినప్పటికీ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్ కు రాకుండా తెలంగాణాలోని హైదరాబాద్ లోనే వుంది. ఆంధ్ర ప్రదేశ్ పై కేంద్రంలో వున్న బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రాంతీయ పార్టీలు అయిన టిడిపి, వైఎస్సార్ సీపీల చేతగాని తనం ఇందుకు కారణం.

ఈ బోర్డుకు విస్తృత అధికారాలు వుంటాయి. కృష్ణా నది మీద అటూ తెలంగాణాలో, ఇటు ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన, నిర్మాణంలో వున్న, నిర్మించబోయే సాగునీటి ప్రాజెక్టుల, జల విద్యుత్ కేంద్రాల అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, మెయిన్ టేనెన్స్, ఆపరేషన్ ఇవన్నీ కూడా బోర్డు పరిధిలోకి వస్తాయి. కృష్ణా నది మీద వున్న ప్రధాన ప్రాజెక్టులలో ఎక్కువ భాగం రాయలసీమ లోని శ్రీశైలం జలాశయం ఆధారంగా వున్నాయి. తెలుగు గంగ, గాలేరు - నగరి, హంద్రీ నీవా, వెలిగొండ, కల్వకుర్తి, SRBC, శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలు.. ఇవన్నీ శ్రీశైలం జలాశయం ఆధారంగా వున్నాయి.

కాబట్టి బోర్డు కార్యాలయాన్ని రాయలసీమ లో ఏర్పాటు చేయడం సమంజసం, న్యాయం. కానీ దురదృష్ట వశాత్తు ఈ కార్యాలయాన్ని విజయవాడ లో ఏర్పాటు చేయాలని చంద్ర బాబు, విశాఖ లో ఏర్పాటు చేయాలని జగన్ బోర్డుకు లేఖలు వ్రాయడం గర్హనీయం. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన బోర్డు సమావేశంలో బోర్డు కార్యాలయాన్ని ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ కు తరలించాలని నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్ కు తరలించాలని నిర్ణయించడం హర్షణీయమైనా, రాయలసీమలోని కర్నూల్ కు తరలించకుండా విజయవాడకి తరలించాలని నిర్ణయించడం బాధాకరం. రాయల సీమకు ఇప్పటికే అనేక అన్యాయాలు జరిగాయి. మరొక్క సారి అన్యాయం జరగడం భావ్యం కాదు. కాబట్టి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాయలసీమ లోని కర్నూల్ లో ఏర్పాటు చేసేటట్లు బోర్డు, రాష్ర్ట ప్రభుత్వం పునరాలోచించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తోందన్నారు.

Tags:    

Similar News