FIRING | కాల్పులతో దద్దరిల్లిన రాయచోటి
గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు.
By : SSV Bhaskar Rao
Update: 2024-12-22 04:41 GMT
నాటు తుపాకీ కాల్పులతో ప్రశాంతంగా ఉన్న రాయిచోటి ఉలిక్కిపడింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణంలోని మాధవరం అనే ప్రాంతంలో ఈ సంఘటన తెల్లవారుజామున జరిగింది.
రాయచోటి పట్టణం మాధవరం ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నాటు తుపాకితో జరిపిన కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటనతో మాధవరం ప్రాంతంలో కలకలం చెలరేగింది. గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో హనుమంతు (50), రమణ (30) తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందింది. గాయపడిన వారిద్దరిని మొదట రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప నగరంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
పట్టణంలో కాల్పులు జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉదయం 10 గంటల వరకు బాధితులు నివాసాల వద్ద విచారణ సాగిస్తున్నట్లు సమాచారం అందింది. తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఇద్దరూ పాత ఇనుప సామాను వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక లావాదేవీలా? మరి ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.