టెక్కలి బాబాయికి, శ్రీకాకుళం అబ్బాయికి టెన్షన్ టెన్షన్..

టెక్కలి, శ్రీకాకుళం సీట్లలో బాబాయ్, అబ్బాయిలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడు అక్కడ గెలుపెవరిది..

Update: 2024-04-23 02:40 GMT

(శివరామ్)

బాబాయ్, అబ్బాయిలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన అన్న కొడుకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడిని ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాలు కలవరపెడుతున్నాయి. అవి వారు పోటీ చేస్తున్న సొంత నియోజక వర్గాలు కూడా కావు. కానీ వారిద్దరూ ఏరి కోరి అభ్యర్థులను మార్చిన ఆ రెండు నియోజకవర్గాలు. అక్కడ పార్టీ విజయం ఇప్పుడు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడులను వెంటాడుతున్నాయి. స్వంత నియోజకవర్గమైన టెక్కలిలో గెలుపుపై అచ్చెన్నాయుడుకు పెద్దగా ఇబ్బందులేమీ లేదు. వైసీపీ గ్రూపు గొడవలు, అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలు అచ్చెన్నాయుడు గెలుపును మరింత తేలిక చేశాయి. అయితే పాత వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం కల్పించిన శ్రీకాకుళం, పాతపట్నం ఇప్పుడు వీరిద్దరికీ సవాల్ విసురుతున్నాయి.

శ్రీకాకుళంలో ధర్మానతో ఢీ

శ్రీకాకుళం సీటును కొత్త అభ్యర్థి గొండు శంకర్‌కు ఇప్పించారు. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబాన్ని కాదని కొత్త అభ్యర్థి గోండు శంకర్‌కు అవకాశం కల్పించడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. 2014 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావుపై విజయం సాధించిన గుండ లక్ష్మీదేవిని పక్కన పెట్టి యువనేతకు అవకాశం కల్పించడం ఇప్పుడు గుండ వర్గం నుంచి శ్రీకాకుళంలో సహాయ నిరాకరణకు కారణమైంది. యువనేత గొండు శంకర్ రాజకీయాల్లో కాకలు తీరిన మంత్రి ధర్మాన ప్రసాదరావును ఢీకొంటున్నారు. శంకర్‌ను గెలిపించాల్సిన బాధ్యతను ఇప్పుడు టికెట్ ఇప్పించిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు తీసుకోవాల్సివచ్చింది. నియోజకవర్గంపై పట్టు ఉన్న అప్పల సూర్యనారాయణ కుటుంబం సహకరించకపోతే ఇక్కడ శంకర్ ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

పాతపట్నంలో కలమటను కాదన్నందుకు..

పాతపట్నం రాజకీయాలను ఎప్పటి నుంచో శాసిస్తున్న కలమట కుటుంబాన్ని పక్కన పెట్టి కొత్త అభ్యర్థి మామిడి గోవిందరావుకు కింజరాపు కుటుంబం టికెట్ ఇప్పించింది. తెలుగుదేశం అసమ్మతి నేతలేను బుజ్జగించి వారితో పని చేయించాల్సిన అవసరం ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ ఆ సీటును వైసీపీనే దక్కించుకొంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కలమట వెంటకరమణ మూర్తి ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. 2019లో ఆయన తెలుగుదేశం అభ్యర్దిగా వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి చేతిలో ఓటమి పాలయ్యారు. అటువంటి నియోజకవర్గంలో కొత్త ప్రయోగం చేయడం ద్వారా అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడులు కొత్త సవాల్‌ను తెచ్చిపెట్టుకొన్నారు. ఎంపీగా రామ్మోహన్నాయుడు గెలుపునకు కూడా ఇప్పుడు ఈ రెండు అసెంబ్లీ స్దానాలు కీలకంగా మారనున్నాయనే ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News