అతను అత్యాధునిక, మోడ్రెన్ ఆర్ట్ గాలిలో కొట్టుకొని పోలేదు. అలా అని దానిని తక్కువ చేసి చూడటం లేదు. దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నారు. దానితో సావాసం చేస్తూనే ఉన్నారు. అయితే ఆ మోజులో పడి తర తరాల నుంచి వారసత్వంగా వస్తున్న ట్రైబల్ ఆర్ట్‌ను మాత్రం వదులుకోలేదు. మోడ్రెన్ ఆర్ట్‌లోని మెళకువలను, టెక్నాలజీలను వంట బట్టించుకున్నారు. వాటిని తన వారసత్వ సంపదకు వాటిని అన్వయించుకుంటూ ఆదివాసీ ఆర్ట్‌ను మరింత అందంగా తీర్చి దిద్దుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఒడిశా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ వంటి అనేక ఇతర రాష్ట్రాల్లో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్‌లలో పాల్గొంటూ ఆదివాసీ ఆర్ట్‌ను, దాని తాలుకు గొప్ప తనాన్ని దేశ ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇంతకీ ఎవరీ ఆర్టిస్ట్ అనుకుంటున్నారా. ఆయనే పేరే రాజు. అందరు ఆయనను సవర రాజు అని పిలుస్తారు.
రాజు పుట్టి పెరిగింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. సీతంపేట మండలం, అడ్డాకుల గూడ. ప్రస్తుతం ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిమ గిరిజన తెగల్లో సవర కూడా ఒకటి. ఆ సవర తెగకు చెందిన వారు రాజు. ఆయన తెగ పేరే ఆయన ఇంటి పేరుగా మారి పోయింది. అందరూ ఆయన్ను సవర రాజు అంటారు.
తమ పూర్వీకుల నుంచి ట్రైబల్ ఆర్ట్‌నేది వార సత్వంగా వస్తోంది. ప్రత్యేకించి చుక్కల పండుగ, పులి పండుగ, మామిడి పండుగ వంటి పర్వదినాల సందర్భాల్లో వీటి ప్రాధాన్యత ఎక్కువుగా ఉండేది. ఆ సందర్భాల్లో తమ జీవన విధానాన్నే ఆర్ట్ రూపంలో వేయడం చేసేవారు. నాడు దీనికి పెద్ద కసరత్తే చేసేవారు. అడవులోకి వెళ్లడం, ఎర్ర మట్టి తేవడం, దానితో ఇంటి లోపల, ఇంటి గోడలను అలికేవారు. ఇంట్లోను, బయట గోడలపైన ఆర్ట్ వేసే వారు. వెదురు బియం్య, దుంపలు, గడ్డితో ప్రత్యేకంగా త్యేకంగా తయారు చేసుకున్న రంగులతో బొమ్మలు గీసే వారు. వెదురు పుల్లలను నోటితో నమిలి బ్రష్‌లుగా చేసుకొని పెయింటింగ్‌లు వేసేవారు. వేట సమయంలో ఎలా సన్నద్దం అవుతారు, వేటకు ఉపయోగించే పరికరాలు, ఎలా వేటాడుతారు, వేటాడిన జంవుతులను ఎలా తీసుకొస్తారు, కొండలు, గుహలు, అడవిలోని జంతువులు, పెంపుడు జంతువులు, మహిళలు, కుటుంబ జీవనం, సంసార జీవనం, దేవుళ్లు, దేవతలు, ఆయుధాలు, అడవి, అందులోని చెట్లు ఇలా అనేక అంశాలతో కూడిన పెయింటింగ్‌లు వేసే వారు.
ఇలా సవరలు తమ ఇంటి గోడలపై వేసుకునే పెయింటింగ్‌లలో వారి జీవన విధానం ఉట్టిపడే విధంగా ఉంటుంది. అందరి ఇళ్ళల్లోను ఇలాంటి వాతావరణం ఉండేది. అయితే అందరూ ఇలాంటి పెయింటింగ్‌లు వేసే నైపుణ్యాన్ని కలిగి ఉండే వారు కాదు. కొందరు మాత్రమే ఈ పెయింటింగ్‌లు వేసే నేర్పును ప్రదర్శించే వారు. ఇదంతా చూస్తూ పెరగడం వల్ల చిన్న నాటి నుంచే తనకు ట్రైబల్ ఆర్ట్‌పై ఆసక్తి పెరిగిందని సవర రాజు ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’కు తెలిపారు. తనకు ఎవ్వరు ఈ కళను నేర్పలేదు. తనకు తానుగా దీనిని నేర్చుకున్నారు. ఒక పక్క చదువుకుంటూనే ట్రైబల్ ఆర్ట్‌పైన ప్రేమ పెంచుకున్నారు. ఆ ఆర్ట్‌లోని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. ఆర్ట్‌కు, తమ జీవన విధానినికి ఎలా ముడి పడి ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. చిన్న నాటి నుంచే వాటిని గీయడం ప్రాక్టీస్ చేశారు.
సవర రాజు మంచిగానే చదువుకున్నారు. బీఎస్సీ బీఈడీ పూర్తి చేశారు. అయినా తన కళను మాత్రం వదులోకోలేదు. అంతకు ముందు చదువుకుంటున్న సయమంలో కూడా దీనికి తగిన ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. ఒక పక్క స్టడీస్ చూసుకుంటూ, తన కుటుంబం జీవనం కోసం వ్యవసాయం పనులు చక్క బెట్టుకుంటూ, మరో పక్క ట్రైబల్ ఆర్ట్‌పైన ప్రత్యేక దృష్టి పెట్టే వారు. తన గ్రామంలోని ఇళ్లల్లోను, ఇంటి గోడలపైన పెయింటింగ్‌లు వేయడం ఎప్పుడూ మాన లేదు. అక్కడ నుంచి బయట ప్రపంచానికి చాటి చెప్పాలని, ట్రైబల్ ఆర్ట్ గొప్ప తనాన్ని, ప్రాముఖ్యతను చాటి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం సాధన చేయడం మొదలు పెట్టారు. సరైన ప్లాట్ ఫామ్ కోసం ఎదురు చూశారు. సీతపం పేట ఐటీడీఏ రూపంలో అది దొరికింది. చేనేత కళల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు మెళకువలు నేర్చుకోవడంతో పాటు తన కళను మరింత మెరుగు పరచుకునేందుకు అవకాశం దొరికింది. ఇక అక్కడ నుంచి వెను తిరిగి చూడ లేదని సవర రాజు తెలిపారు.
ఇప్పటి వరకు ఢిల్లీ, పూనే, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, భువనేశ్వర్, చత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల్లో జరిగిన ఎగ్జిబిషన్‌లలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఆర్ట్‌ను ప్రదర్శింప చేసి మన్నననలు పొందారు. అవార్డులు కూడా అందుకున్నారు. 2016లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవార్డును దక్కించుకున్నారు. 2021లో వైఎస్‌ఆర్ ఎచీవ్‌మెంట్ అవార్డును సొంతం చేసుకున్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా భువనేశ్వర్‌లో ట్రైబల్ ఆర్ట్ మీద నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో తన టీమ్ ప్రథమ బహుమతి గెలుచుకుందని సవర రాజు తెలిపారు.
2011 నుంచి తన పెయింటింగ్ ప్రస్థానం ప్రారంభించారు. లైవ్లీహుడ్ కింద ఐటీడీఏ తరఫున పొందిన శిక్షణ ద్వారా తను తయారు చేసిన ఆర్ట్ ఫామ్‌లను మార్కెట్‌లో విక్రయాలు కూడా చేపట్టారు. మ్యాన్ మేడ్ పేపర్ ద్వారా పెన్ స్టాండ్లు, ఫొటో ఫ్రేములు, బ్యాగులతో పాటుగా తమ జీవన విధానాన్నే ఆర్ట్‌గా మలచి వివిధ రూపాలను తయారు చేసి మార్కెట్లో విక్రయించే వారు. తొలుత మంచి డిమాండ్ వచ్చినా తర్వాత కాస్త తగ్గిందని, దీంతో ప్రస్తుతానికి దానిని చేయడం లేదని అక్టోబర్ నుంచి తిరిగి దానిని మొదలు పెడతామని రాజు తెలిపారు. తనతో పాటు మరి కొందరితో కలిసి ఈ పని చేస్తామని చెప్పారు.
అయితే ట్రైబల్ ఆర్ట్‌ను మాత్రం వదల్లేదు. కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. తన ఆర్ట్‌ను ఫొటో ఫ్రేములుగా తయారు చేస్తున్నామని రాజు చెప్పారు. ట్రైబల్ ఆర్ట్ పెయింటింగ్‌లు కావాలని తమను సంప్రదిస్తే తయారు చేసి వారికి ఇస్తున్నారు. ప్రత్యేకించి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వంటి సందర్భాల్లో కానీ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అడిగినప్పుడు, ఎవరికైన బహుమతులు ఇవ్వాలని కోరిన సందర్భాల్లో తమకు ఆర్డర్లు వస్తాయని ఆ మేరకు తయారు చేసి అందిస్తున్నట్లు రాజు తెలిపారు.
ట్రైబల్ ఆర్ట్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది తమ వద్దకు వస్తుంటారని రాజు చెప్పారు. కడప ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ నుంచి, గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఇలా అనేక ప్రాంతాల నుంచి ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు, ఆర్ట్‌పై మక్కువ ఉన్న ఔత్సాహికులు తమ వద్దకు వచ్చి ట్రైబల్ ఆర్ట్ గురించి చెప్పించుకొని వెళ్తుంటారని రాజు చెప్పారు. తమ గూడేల్లో కూడా ఇది వరకటిలా ట్రైబల్ ఆర్ట్‌పైన పెద్ద ఇంట్రెస్ట్ కానీ ఆదరణ కానీ లేదని, రాను రాను ఇది తగ్గుతోందని, తమ జనరేషన్ తర్వాత ట్రైబల్ ఆర్ట్ కూడా అంతరించి పోతుందనే భయం వెంటాడుతోందనే ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కాపాడుకునేందుకు ఆదివాసీలకు కూడా దీని ప్రాముఖ్యతను తెలియజేస్తున్నామని చెప్పుకొచారు. ఇది తమ వార సత్వ సంపదని, దీనిని కాపాడుకోవడం మన బాధ్యతని గుర్తు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. బీఎస్సీ, బీఈడీ చదువుకున్న తనకు ఏ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా ట్రైబల్ ఆర్ట్‌ను మాత్రం వదిలేది లేదని, తాను కొనసాగించడంతో పాటు తన తర్వాత తరాలకు కూడా అర్థమయ్యే విధంగా చెబుతానని, ట్రైబల్ ఆర్ట్ గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పాలనేది తన లక్ష్యమని తన ఫ్యూచర్ ప్లాన్ గురించి ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’కు సవర రాజు చెప్పుకొచ్చారు.