రాజ్‌ కసిరెడ్డి రెండో రోజు సిట్‌ విచారణ

లిక్కర్‌ స్కామ్‌లో వారం రోజుల పాటు రాజ్‌ కసిరెడ్డిని సిట్‌ అధికారులు విచారించనున్నారు.;

Update: 2025-05-03 08:09 GMT

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కసిరెడ్డిని రెండో రోజు విచారించేందుకు సిట్‌ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి వచ్చిన ప్రధాన కేసుల్లో లిక్కర్‌ స్కామ్‌ ఒకటి. ముంబాయి సినీ నటి కాందబరి జెత్వానీ కేసు కూడా మరో ప్రధానమైన కేసు. ఈ రెండు కేసులు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారాయి.

లిక్కర్‌ స్కామ్‌ కేసులో రాజ్‌ కసిరెడ్డిని ఏ1 నిందితుడిగా చేర్చారు. హైదారబాద్‌లో అరెస్టు చేసిన రాజ్‌ కసిరెడ్డిని విజయవాడ జైలుకు పంపారు. ప్రస్తుతం ఆయన రిమాండ్‌ ఖైదీగా ప్రస్తుతం ఆయన విజయవాడ జైల్లో ఉన్నారు. లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక నిందితుడుగా రాజ్‌ కసిరెడ్డి ఉన్నారని, ఈయన నుంచి కీలక విషయాలు రాబట్టాల్సి ఉందని, దీంతో రాజ్‌ కసిరెడ్డిని విచారించాల్సి ఉందని, దీని కోసం పది రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని సిట్‌ అధికారులు కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు పది రోజులకు బదులు వారం రోజులు కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజ్‌ కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. రెండో రోజైన శనివారం కస్టడీకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సిట్‌ కార్యాలయానికి తరలించారు.
తొలి రోజైన శుక్రవారం రాజ్‌ కసిరెడ్డిని ఏడు గంటల పాటు సిట్‌ అధికారులు విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించిన సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కాల్‌డేటా రికార్డులు, కేసులో సాక్షులుగా ఉన్న వారు ఇచ్చిన వాంగ్మూలాల వంటి ఆధారాలతో రాజ్‌ కసిరెడ్డిని ప్రశ్నించారు. తొలి రోజు సిట్‌ అధికారుల విచారణకు రాజ్‌ కసిరెడ్డి సహకరించినా.. ఎక్కువ శాతం ప్రశ్నలకు దాటవేత ధోరణిలో రాజ్‌ కసిరెడ్డి సమాధానాలు చెప్పారనే టాక్‌ సిట్‌ అధికారుల్లో ఉంది. రెండో రోజు విచారణలో రాజ్‌ కసిరెడ్డి సిట్‌ అధికారులకు సహకరిస్తారా? వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News