ఈ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు
మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురి అవకాశాలు ఉన్నాయి.;
పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది మంగళవారం లోగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాతో పాటు అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు.
అదేవిధంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోనసీమ జిల్లాతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ అల్పపీడన ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతంలో 40–60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, దీంతో గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళారాదని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచంచారు.