ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి
క్వాంటం వ్యాలీ తరహాలోనే రాష్ట్రానికి వస్తున్న ఈ డేటా సెంటర్లు టెక్నాలజీ రంగంలో కీలక మలుపు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎకనమిక్ కారిడార్ తరహాలోనే రాయలసీమకూ ఓ ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించారు. ఆమేరకు మూడు ప్రాంతాలను పారిశ్రామిక జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకూ విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను ఏర్పాటు చేస్తున్నామని అదే తరహాలో అమరావతి కేంద్రంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకూ ఒక ఆర్ధిక ప్రగతి రీజియన్‌ను , నెల్లూరు, రాయలసీమ జిల్లాలతో మరో ఎకనామిక్ డెవలప్మెంట్ రీజియన్లను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ , డ్రోన్ సిటీలతో పాటు ఆటోమొబైల్ కారిడార్లు అభివృద్ధి అవుతున్నాయని సీఎం అన్నారు.
వీటితో పాటు ఉద్యాన పంటలకు కేంద్రంగా ఉన్న రాయలసీమ ఆగ్రో ప్రాసెసింగ్ హబ్‌గా మారుతోందని త్వరలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేంద్రంగా ఈ ప్రాంతం మారుతుందని అన్నారు. అమరావతి రాజధాని నగరం క్వాంటం వ్యాలీతో నాలెడ్జి ఎకానమీ కేంద్రంగా మారుతుందని సీఎం అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లును కూడా అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా తయారు చేయాలని.. దీని కోసం ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసుకుని ప్రాజెక్టులను ఆహ్వానించాలని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు వచ్చినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నా ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక ప్రాజెక్టులను రైల్వే లైన్‌కు కూడా అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గి ఆయా ప్రాజెక్టులకు ప్రయోజనం కలుగుతుందని సీఎం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో విలువ జోడింపుపైనా దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే ఆతిథ్య రంగానికి చెందిన ప్రాజెక్టులపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పర్యాటకులకు నాణ్యమైన వసతి లభించేలా చూడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వివిధ కేటగిరీల హోటళ్లకు అనుబంధంగా ఎకో సిస్టం కూడా వచ్చేలా చూడాలని సూచించారు. తిరుపతిలో ఉన్న కలినరీ ఇనిస్టిట్యూట్‌ను డీమ్డ్ యూనివర్సిటీగా హోదా పెంచి వివిధ సంస్థలను అనుసంధానించాలని పేర్కొన్నారు. కూచిపూడి, థింసా లాంటి సంప్రదాయాలతో పాటు వివిధ ఎక్స్ పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసే అంశంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇటీవల విజయం సాధించిన విజయవాడ ఉత్సవ్ తరహాలోనే విశాఖ, రాజమహేంద్రవరం లాంటి చోట్ల కూడా ఉత్సవ్‌లను నిర్వహించాలని సూచించారు.
మెగా పారిశ్రామిక ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు
అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని.. ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. టీసీఎస్ సంస్థ కూడా ఇక్కడ త్వరలోనే క్యాంపస్‌ను ప్రారంభించనుందని.. ఒక్క విశాఖ నగరంలోనే 5 లక్షల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. ఐటీ సంస్థల్లు, అందులో పనిచేసే ఉద్యోగులకు హౌసింగ్‌తో పాటు రహదారులు, ఇతర మౌలిక వసతులు ఉండేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. మాస్టర్ ప్లాన్‌తో స్థానిక టౌన్ షిప్‌లు ఏర్పాటు చేయాలని అన్నారు. అనకాపల్లి నుంచి విజయనగరం వరకూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. వీటితో పాటు 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
రామాయపట్నం సమీపంలో వస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీతో పాటు ఆర్సెలార్ మిట్టల్, రైడెన్ డేటా సెంటర్ లాంటి భారీ ప్రాజెక్టులు ప్రారంభం అయ్యే వరకూ పర్యవేక్షణ చేసేలా ప్రత్యేక అధికారులను నియమించాలని అన్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులకు లాజిస్టిక్స్‌ను ఇంటిగ్రేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలు, నీటి సరఫరా, వినియోగం లాంటి అంశాలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2028 నాటికల్లా జిందాల్ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేలా చూడాలని సీఎం పరిశ్రమల శాఖను ఆదేశించారు. ఎస్ఐపీబీ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, పి.నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, అనగాని సత్యప్రసాద్‌తో పాటు సీఎస్ కె.విజయానంద్, పరిశ్రమలు, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటకం, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 11వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల వివరాలు ఇవీ
1. యాక్మే ఊర్జా ఒన్ లిమిటెడ్ - అనంతపురం జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టులో రూ.2 వేల కోట్ల పెట్టుబడి, 1380 మందికి ఉద్యోగాలు
2.టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు రూ.2 వేల కోట్ల పెట్టుబడి, 1,380 మందికి ఉద్యోగాలు
3.చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరం జిల్లాలో పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టు రూ.12,905 కోట్ల పెట్టుబడి, 3వేల మందికి ఉద్యోగాలు
4.ఆంఫ్లిన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సౌరవిద్యుత్ ప్రాజెక్టు రూ.15.10 కోట్లు పెట్టుబడి
5. రిలయన్స్ కన్సూమర్ ప్రోడక్స్ట్ కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో ఎఫ్ఎంసీజీలో రూ.758 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగాలు
6. గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ రూ.208 కోట్ల పెట్టుబడులు, 66 మందికి ఉద్యోగాలు
7.ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ రూ.201 కోట్ల పెట్టుబడి, 436 మందికి ఉద్యోగాలు
8.ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.33 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు
9.దస్పల్లా అమరావతి హోటల్స్ అమరావతిలో రూ.200 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు
10.వీఎస్కే హోటల్స్ రిసార్ట్స్ అరకు వ్యాలీలో రూ.55 కోట్ల పెట్టుబడి, 98 మందికి ఉద్యోగాలు
11.శ్రీవేంకటేశ్వరా లాడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీశైలంలో రూ.83 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు
12. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అమరావతిలో రూ.117 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు
13.. మైరా బే వ్యూ రిసార్ట్స్ కొత్తవలసలో కన్వెన్షన్ సెంటర్ కు రూ.256 కోట్ల పెట్టుబడి
14.ఎస్వీఎస్ కనస్ట్రక్షన్స్ కాకినాడ లో రూ.87 కోట్ల పెట్టుబడి,
15.రైడన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.87,520 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు.
16. ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్స్ ఇండియా విశాఖ కాపులుప్పాడ లో ఐటీ లాజిస్టిక్స్ రూ.140 కోట్ల పెట్టుబడి, 2600 మందికి ఉద్యోగాలు
17. శాన్వీరా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ రూ.2600 కోట్ల పెట్టుబడి, 800 మందికి ఉద్యోగాలు
18. శ్రీ సిమెంట్ లిమిటెడ్, పలనాడులో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ రూ.2260 కోట్ల పెట్టుబడి, 350 మందికి ఉద్యోగాలు
19.రేమండ్, జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ అనంతపురంలో ఏరో స్పేస్ ఆటోమోటివ్ కాంపోనెంట్ రూ.430 కోట్ల పెట్టుబడి, 4,096 మందికి ఉద్యోగాలు
20. రేమాండ్ జేకే మైనీ గ్లోబల్ ఎరోస్పేస్ లిమిటెడ్, అనంతపురంలో ఏరోస్పేస్ కాంపోనెంట్లు రూ.510 కోట్ల పెట్టుబడి, 1400 మందికి ఉద్యోగాలు.
21. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద రూ.1200 కోట్ల పెట్టుబడి, 1400 మందికి ఉద్యోగాలు
22. అలీప్ ఓర్వకల్లు వద్ద మహిళా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం రూ.36.25 కోట్ల పెట్టుబడి, 3000 మందికి ఉద్యోగాలు
23. అవంతీ వేర్ హౌసింగ్ సర్వీసెస్ విశాఖలో గుర్రమ్ పాలెం, రూ.319 కోట్ల పెట్టుబడి
24.అస్సెల్ ఈఎస్ జీ కర్నూలు జిల్లా కృష్ణగిరిలో రూ.300 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు
25. ఫెయిర్ ఎక్స్ పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ మల్లవెల్లి లో మెగా ఫుడ్ పార్క్ కోర్ ప్రాసెసింగ్ సెంటర్
26. జెఎస్ డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్, విజయనగరంలో ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్, రూ.531 కోట్ల పెట్టుబడి, 45000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.