‘అంబుజా సిమెంట్‌’పై ప్రజాభిప్రాయ సేక ‘రణం’!

విశాఖ జిల్లా గంగవరం పోర్టుకు అనుబంధంగా నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ రణరంగాన్ని తలపించింది.

Update: 2025-10-08 13:09 GMT
అంబుజా సిమెంట్‌ వద్దంటూ నినదిస్తున్న స్థానిక మహిళలు

ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే కాలుష్య కారక సిమెంట్‌ కర్మాగారం ఏర్పాటును స్థానికుల ముక్తకంఠంతో వ్యతిరేకించారు. విశాఖ జిల్లా గంగవరం పోర్టు సమీపంలోని పెదగంట్యాడ వద్ద ఈ ఫ్యాక్టరీని అదానీ సంస్థ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఏటా నాలుగు మిలియన్‌ టన్నుల సిమెంట్‌ గ్రౌండింగ్‌ సామర్థ్యం కలిగిన రెండు మిల్లులను స్థాపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం నడుపూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో అధికారులు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే తమ ప్రాంతంలో సిమెంటు ఫ్యాక్టరీని అనుమతించేది లేదంటూ కొన్నాళ్లుగా ఆ ప్రాంత వాసులు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ బుధవారం ఉదయం 11 గంటలకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు ఉపక్రమించారు. వేదిక కోసం భారీ టెంట్లను వేశారు. పోలీసులను భారీగా మోహరించారు. అయినప్పటికీ స్థానికులు మహిళలతో పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీకి అంగీకరించేది లేదని నినాదాలు చేశారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు. ముందుకు దూసుకుపోయి టెంట్లను ధ్వంసం చేశారు. వేదికను కూల్చివేశారు. బ్యానర్లను చించి పడేశారు. కుర్చీలను విసిరి కొట్టారు.


ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్న ప్రజలు

మిగిలిన కుర్చీలను ఒక చోటకు కుప్పగా చేర్చి ధర్నాకు దిగారు. వీరిని నిలువరించడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అధికారులు చేసేది లేక ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కాకుండా పలాయనం చిత్తగించారు. విశాఖ ఆర్డీవో శ్రీలేఖను సైతం ఆందోళనకారులు అడ్డగించడంతో ఆమె వెనుదిరిగి వెళ్లిపోయారు. అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు, నల్ల రిబ్బను ధరించి నిరసన వ్యక్తం చేశారు. అంబుజా గో బ్యాక్‌.. సీఎం డౌన్‌ డౌన్‌.. అంటూ నినదించారు. అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్దే వద్దంటూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు.


సిమెంట్‌ ఫ్యాక్టరీ అనర్థాలను వివరిస్తున్న స్థానికులు

కాలుష్యాన్ని భరించడం మా వల్లకాదు..
ఇప్పటికే తాము పరిశ్రమల కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్నామని, కొత్తగా అంబుజా సిమెంట్‌ వెదజల్లే కాలుష్యాన్ని భరించడం తమ వల్ల కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పెదగంట్యాడలో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. వీరిలో ఎక్కువ మంది మత్స్యకారులు ఉండడంతో పరిస్థితి అదుపు తప్పుతుందన్న ఆందోళన పోలీసుల్లోనూ కనిపించింది. గతంలో గంగవరం పోర్టు ఏర్పాటు సమయంలోనూ స్థానికుల నుంచి ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. అప్పట్లో పోలీసు కాల్పుల్లో ఓ మత్స్యకారుడు చనిపోయాడు. ఆ తర్వాత నెలల తరబడి కర్ఫ్యూ, పోలీస్‌ పికెటింగ్‌లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బుధవారం నాటి ఉద్రిక్త వాతావరణంలో ప్రజాభిప్రాయ సేకరణకు అధికార యంత్రాంగం ముందడుగు వేయలేకపోయింది.

ఆందోళనకారులను నిలువరిస్తున్న పోలీసులు 

కాలుష్యంపై కనువిప్పుతోనే..
పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటికే కాలుష్య భూతం స్థానికులను వెంటాడుతోంది. కాలుష్య ప్రభావంతో ఎంతోమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలతోనే వీరంతా సతమతమవుతున్నారు. ఇప్పడు వాటికి అదనంగా ఫ్యాక్టరీలను ఏర్పాటును వీరు అంగీకరించడం లేదు. ఎక్కడైనా కాలుష్య కారక పరిశ్రమలు వస్తున్నాయంటేనే ఒంటి కాలిపై లేస్తున్నారు. చిన్నా, పెద్దా, ఆడా, మగా తేడా లేకుండా ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు పెదగంట్యాడ ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన అంబుజా సిమెంట్‌ కర్మాగారం విషయంలోనూ అదే రీతిలో నిరసనలకు దిగుతున్నారు. అధికార కూటమి పార్టీల నేతలు సహా ఇతర రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు వీరికి అండగా నిలుస్తున్నాయి.
అదాని డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు..
అదానీకి చెందిక అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్న ప్రాంతంలో అంబుజా సిమెంట్‌ పోరాట కమిటీ, సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఈ నాయకులు మాట్లాడుతూ అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీని జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల గంగవరం, పెదగంట్యాడ నుంచి గాజువాక అసెంబీ నియోజకవర్గం, సింధియా, శ్రీహరిపురం వరకు గల పశ్చిమ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లోని సుమారు పది లక్షల మంది ప్రజలు అనారోగ్యం బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమతో గాలి, నీరు, భూగర్భ జలాలు కలుషితమవుతాయని, శబ్ద కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నారు. భారీ వాహనాల రాకపోకలు పెరిగి ప్రమాదాలు జరుగుతాయని, ఈ పరిశ్రమకు కేటాయించిన భూముల్లో చెట్లు, కొన్ని రకాల వన్య ప్రాణులు కనుమరుగవుతాయని, పర్యావరణానికి హాని చేకూరుతుందని చెప్పారు. అదాని సిమెంట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ‘అదాని డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు.
Tags:    

Similar News