జగన్ కేసులో రఘురామకు ఎదురు దెబ్బ
జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌కు ఢోకా లేదు. రఘురామకృష్ణరాజు పిటిషీన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు.;
By : Admin
Update: 2025-01-27 08:28 GMT
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పెద్ద ఊరట లభించగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దీంతో జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దుపై నెలకొన్న నీలి మేఘాలు తొలగి పోగా.. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను వెనక్కి తీసుకోవాలని రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో పిటీషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు రఘురామకృష్ణరాజు తరపున న్యాయవాది సుప్రీం కోర్టుకు విన్నవించుకున్నారు. అసలు ఏమి జరిగిందంటే..
అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఉండి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జగన్ మోహన్‌రెడ్డి కేసును విచారిస్తున్న ధర్మాసనాన్ని కూడా మార్చాలని దాఖలు చేసిన పిటీషన్‌లో సుప్రీం కోర్టును కోరారు. దీనిపైన గత సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పిటీషనర్ అయిన రఘురామకు ఊరటనిచ్చే విధంగా నిర్ణయాన్ని ప్రకటించింది. ఆయన కోరిన విధంగానే ధర్మాసనాన్ని మారుస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది. అప్పటి వరకు విచారిస్తూ వస్తున్న జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనానికి బదులుగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనానికి జగన్ కేసును అప్పగించింది.
కొత్తగా మారిన ధర్మాసనం సోమవారం జగన్‌మోహన్‌రెడ్డి కేసు మీద విచారణ చేపట్టింది. గత 12ఏళ్లుగా జగన్ కేసుల విచారణ ముందుకు సాగడం లేదు. ఒక్క డిశ్చార్జి అప్లికేషన్ కూడా డిస్పోజ్ కాలేదు. గతంలో చేపట్టిన విచారణలో జగన్ కేసుల బదిలీ సాధ్యం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే కేసుల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో జరగాలని ఇప్పుడు కోరుతున్నామని పిటీషనర్ రఘురామ తరపున న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టులో తన వాదనలు వినిపించారు. ఇదే సమయంలో సీబీఐ న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు. సీబీఐ కేసుల వివరాలు, తాజా పరిస్థితులన్నింటినీ వివరిస్తూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జగన్‌మోహన్‌రెడ్డి తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ కూడా తన వాదనలు వినిపించారు. ఈ కేసును తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణ చేస్తోందని, ఇంకా అక్కడ పెండింగ్‌లో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అందరి వాదనలను విన్న ధర్మాసనం తన తీర్పును వెల్లడించింది. జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న రఘురామ పిటీషన్‌ను తోసి పుచ్చింది. దీంతో పాటుగా కేసును తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. ఆ మేరకు రఘురామకృష్ణరాజు వేసిన పిటీషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దుకు కారణాలేమీ లేవని, అందువల్ల బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా దీంతో పాటుగా జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ కేసులను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయలేమని వెల్లడించిన ధర్మాసనం.. జగన్ కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా? అంటూ పిటీషనర్ మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయితే గతంలో ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో రోజు వారీ విచారణ చేపట్టాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకూ కూడా వర్తిస్తుందని పేర్కొంది. ట్రయల్ కోర్టు కేసును రోజు వారీ విచారణకు తీసుకోవాలని, హై కోర్టు కూడా మోనటరింగ్ చేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలు చేసిన పిటీషన్‌ను వెనక్కి తీసుకుంటామని పిటీషనర్ తరుపున న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం సుప్రీం కోర్టుకు విన్నవించారు.
జగన్ బెయిల్ రద్దు కోసం గత కొన్నేళ్లుగా రఘురామ పట్టువదలని పోరాటం చేస్తూ వస్తున్నారు. తొలుత హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో భంగపడ్డ ఆయన ఆ పై తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మీ ఇంట్రెస్ట్ ఏంటంటూ ఆగ్రహించిన హైకోర్టు ఆ పిటీషన్ ను తిరస్కరించింది. అయినా పట్టు వదలకుండా ఆయన సుప్రీం కోర్టు తలుపు తట్టారు. గత కొద్ది నెలలుగా ఈ పిటీషన్ ను విచారించిన సుప్రీం కోర్టు దీనిపై విచారణ అవసరం లేదని తీర్పు చెప్పడంతో ఆఖరుకు ఆ పిటీషన్ ను రఘురామ ఉపసంహరించుకోక తప్ప లేదు.