వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాలి: రఘురామరాజు

తన కేసులోని నిందితులను పోలీసు కస్టడీలో విచారించాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు.. ఏపీ డీజీపీ, హోంమంత్రిని కోరారు.

Update: 2024-07-13 11:04 GMT

ఒక ఎంపీని కిడ్నీప్ చేసి, హత్య చేయాలని చూసిన వారిని ఉపేక్షించకూడదని, వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ డీజీపీని, హోంమంత్రిని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు కోరారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో తనను తెలంగాణలో అరెస్ట్ చేసి అక్కడ స్థాని మెజిస్ట్రేట్ దగ్గర ట్రాన్సిట్ ఆర్డర్స్ కూడా తీసుకోకుండానే గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారని, అక్కడ తనను చిత్రవధ చేయడమే కాకుండా చంపేయాలని కూడా ప్రయత్నించారని రఘురామకృష్ణం రాజు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కొందరు ఉన్నతాధికారులు అలా చేశారని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మాజీ సీఎం జగన్ సహా అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుపై కేసు నమోదు చేశారు పోలీసులు.

తాజాగా ఈ అంశంపై రఘురామ మరోసారి స్పందించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి పోలీసు కస్టడీలో విచారించాలని కోరారు. అప్పట్లు తనకు చికిత్స అందించిన వైద్యులతో మరోసారి ఎవరూ ఒత్తిడి తీసుకురాకుండా పోలీసులు నిఘా ఉంచాలని తెలిపారు. ‘‘అప్పుడు హైకోర్టు జడ్జి సమక్షంలో మిలటరీ ఆసుపత్రి వైద్యులు నాకు పరీక్షలు చేసి నివేదిక సిద్ధం చేశారు. అందులో హింసించడం వల్లే వేలు విరిగిందని, రక్తస్రావం అయిందని ఉంది. ఆధారాలు ఉంటే ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. కొట్టిన వారిని గుర్తు పట్టలేదని గతంలో చెప్పిన మాటల్లో అవాస్తవం ఏమీ లేదు. కానీ దీనిక మొత్తానికి కుట్ర పన్నింది మాత్రం జగన్, సీతారామాంజనేయులు, పీవీ సునీల్ కుమార్’’ అని రఘురామ పేర్కొన్నారు.

దృష్టి మళ్లించడానికి సునీల్ యత్నం

తనను చంపడానికి జగన్ సహా పలువురు అధికారులు ప్రయత్నించారంటూ రఘురామ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఆరోజే స్పందించారు. ‘‘మూడేళ్లు సుప్రీంకోర్టులో జరిగిన కేసుపై మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విచిత్రంగా ఉంది’’ అంటూ ఎక్స్(ట్వీట్) పోస్ట్ పెట్టారు. అయితే సునీల్ కుమార్ పెట్టిన పోస్ట్ కేవలం ప్రజల దృష్టి మరల్చడానికేనని రఘురామ తోసిపుచ్చారు. ఆధారాలు ఉంటే ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు, ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు అని రఘురామ చెప్పారు. వారి తప్పులేనప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇంత ఉలిక్కిపడుతున్నారెందుకు అంటూ విమర్శించారు.

Tags:    

Similar News