పార్లమెంట్‌ ఎన్నికల్లో పీవీదే ఆల్‌టైం రికార్డ్‌

ఆంధ్రపదేశ్‌ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్‌కు పోటీ చేసి అత్యధిక మెజారిటీ సాధించిన వారిలో పీవీతో పాటు నలుగురు ఉన్నారు.

Update: 2024-05-08 05:55 GMT

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి పోటీ చేసి గెలిచిన వారిలో మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు ఆల్‌టైం రికార్డు స్ధాంచారు. పార్లమెంట్‌ చరిత్రలోనే ఆయన అత్యధిక మెజారిటీ సాధించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నమోదయ్యారు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బీట్‌ చేయకపోవడం విశేషం. పార్లమెంట్‌ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో ఏపీ నుంచి అత్యధిక మెజారిటీ సాధించిన వారు నలుగురు ఉన్నారు. వారిలో ముగ్గురు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయగా మరొకరు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు.

మొత్తం ఓట్లలో దాదాపు సగభాగం దక్కించుకొని బంబర్‌ మెజారిటీ సాధించిన వారిలో పీవీ నరసింహారావు ప్రథముడు. ఈయన నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌–ఐ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పీవీ నరసింహారావుకు 5,80,035 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచిన పీవీ నరసింహారావు దేశ ప్రధానమంత్రి అయ్యారు. 1996లో జరిగిన ఎన్నికల్లో పీవీ నంద్యా, బరంపురం రెండు చోట్ల ఎంపీగా పోటీ చేశారు. రెండు చోట్లా గెలుపొందారు. అయితే నంద్యాల ఎంపీకి రాజీనామా చేసి, ఓడిశాలోని బరంపురం ప్లామెంట్‌ నుంచి కొనసాగారు. అదే సంవత్సరంలో నంద్యాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి అత్యధిక మెజారిటీతో టీడీపీ తరపున గెలిచారు.
రెండో స్థానంలో వైఎస్‌ జగన్‌
2011లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప పార్లమెంట్‌ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి 5,45,671 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇది రెండో రికార్డు. జగన్‌పై కాంగ్రెస్‌ ఐ అభ్యర్థిగా డిఎల్‌ రవీంద్రారెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. వైఎస్సార్‌ మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో 2009లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎంపీ పదవికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేసి, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి ఈ రికార్డును సృష్టించారు.
మూడో స్థానంలో వైఎస్‌ఆర్‌
1991లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కడప పార్లమెంట్‌ నుంచి ఎంపీగా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌–ఐ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్‌ఆర్, టీడీపీ నుంచి పోటీ చేసిన సి రామచంద్రయ్యపై నెగ్గారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌కు దాదాపు 4,22,780 ఓట్ల మెజారిటీ వచ్చింది. పీవీ, జగన్‌ల తర్వాత అత్యధిక మెజారిటీ సాధించిన నేతగా నిలచారు.
పీవీ నరసింహారావు రాజీనామా చేయడంతో నంద్యాల పార్లమెంటుకు 1996లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ నేత భూమా నాగిరెడ్డి టీడీపీ నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన రంగయ్య నాయుడు మీద 4,41,142 ఓట్ల మెజారిటీ సాధించారు. పీవీ, జగన్, వైఎస్‌ఆర్‌ల తర్వాత అధిక మెజారిటీ సాధించిన నేతగా భూమా నిలచారు.
కడప, నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన నాయకులు మాత్రమే అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఇక్కడ వైఎస్‌ఆర్‌ మినహా మిగిలిన ముగ్గురు సానుభూతితోనే అంత భారీ మెజారిటీ సాధించారని టాక్‌ ఉంది. రాష్ట్ర ప్రజలకు సానుభూతి ఎక్కువేనని ఈ రికార్డులు రుజువు చేస్తున్నాయి. వైఎస్‌ఆర్‌ చనిపోయిన తరువాత వైఎస్‌ జగన్‌పైన అత్యంత సానుభూతిని చూపించారు. రాజీవ్‌గాంధీ చనిపోయిన తరువాత పీవీ నరసింహారావుకు సానుభూతిని చూపించారు.
Tags:    

Similar News