ప్రంపంచ ప్రశాంతి ఉత్సవానికి సిద్ధమైన పుట్టపర్తి..
అందరి చూపు సత్యసాయి నిలయం వైపే...
Byline : SSV Bhaskar Rao
Update: 2025-11-10 18:50 GMT
పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు సిద్ధమైంది. సత్యసాయి పుట్టిన రోజు సందర్భంగా ఇక్కడి విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి కూడా ఆయన జయంతి రోజు నిర్వహించే కార్యక్రమాలు సిద్ధం చేశారు.
విశ్వమంతా భక్తులు ఉన్న పుట్టపర్తి సత్యసాయి నిలయంలో శతజయంతి వేడుకలు పది రోజులపాటు రాష్ట్ర పండుగగా టిడిపి కూటమి ప్రభుత్వం ఈనెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రశాంతి నిలయంలో జరగనున్న ఈ ఉత్సవాలకు దాదాపు ఐదు లక్షల మందికి పైగానే హాజరయ్యే అవకాశం ఉన్నందున ఓ రికార్డుగా నిలవనుంది. ఆ మేరకు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
19న ప్రధాని రాక.. ట్రస్టు ఏర్పాట్లు
పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ మాత్రం 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించడానికి కార్యక్రమాలు సిద్ధం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తో సహా ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వేలాది మంది భక్తులు ప్రతినిధులు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ మంత్రులు, వివిఐపీలు, దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం, సత్య సాయి నిలయంలో సెంటర్ ట్రస్ట్ కార్యదర్శి ఆర్.జే. రత్నాకర్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
రూ. 100 స్మారక నాణెం విడుదల
పుట్టపర్తికి ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 19వ తేదీ రానున్నారు. సాయికుల్వంత్ హాలులో సత్యసాయి సమాధి వద్ద జరిగే ఆరాధనలో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత శ్రీసత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే పెద్ద సభలో ఆయన పాల్గొంటారు. ఇదే వేదిక పైనుంచి శ్రీసత్యసాయిబాబా గౌరవార్థం తయారు చేసిన రూ. 100 స్మారక నాణెం, పోస్టల్ స్టాంపు విడుదల చేస్తారు. హైదరాబాద్ లోని మింట్ (Mint ) కాంపౌండులో వాటిని తయారు చేశారు. పోస్టల్ శాఖ తపాలా బిళ్లను సిద్దం చేసింది.
ఉపరాష్ట్రపతి సీపీ. రాథాకృష్ణన్ 22వ తేదీ హాజరవుతారని సమాచారం. శ్రీసత్యసాయి ఇన్సిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సంస్థను 1981లో సత్యసాయిబాబా స్థాపించారు. ఉచితంగానే కాకుండా విలువలతో కూడిన ఉన్నత విద్య బోధించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.
140 దేశాల నుంచి ప్రతినిధులు
పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలకు 140 దేశాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో బాబా జయంతి ఉత్సవాలు 18వ తేదీ నుంచి 24వరకు నిర్వహించడానికి వీలుగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి ఆర్ జె. రత్నాకర్ ఈ కార్యక్రమాల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
ప్రశాంతినిలయం వర్గాల సమాచారం మేరకు..
విదేశీ ప్రతినిధులు,, ప్రభుత్వ అధికారుల తోసహా పది వేల మంది ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారని తెలిసింది. ప్రపంచ వ్యాపితంగా ఉన్న సత్యసాయి కేంద్రాల ద్వారా దాదాపు 1,500 మంది అంతర్జాతీయ ప్రతినిధులు శ్రీసత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ద్వారా అధికారికంగా పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సత్యసాయి ట్రస్టు ఉచిత భోజనం, వసతి, రవాణ సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.
అఖండ భజనతో ప్రారంభమైన వేడుకలు..
ప్రపంచ మానవాళికి ప్రేమను పంచిన శ్రీసత్య సాయి శతజయంతి వేడుకలలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఉన్న సాయి కుల్వంత్ మందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీ సత్య సాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ దేశ,విదేశీ అధినేతలను కూడా స్వయంగా ఆహ్వానించారు.
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శతజయంతి వేడుకలకు ఈనెల 8వ తేదీని గ్లోబల్ అఖండ భజనతో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 10 రోజులపాటు శతజయంతి ఉత్సవాల నిర్వహిస్తున్నప్పటికీ సిరి సత్యసాయి ట్రస్టు ద్వారా ఈనెల 18వ తేదీ జరిగే రథోత్సవంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 19న హిల్ వ్యూ స్టేడియంలో (Hill View Stadium) జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. 20, 21వ తేదీల్లో సాయి కుల్వంత్ మందిరంలో నాయకత్వ లక్షణాలపై యువజన సదస్సులు నిర్వహిస్తారు.
స్నాతకోత్సవం
పుట్టపర్తి సత్యసాయి విశ్వవిద్యాలయంలో ప్రతి సంవత్సరం సాయిబాబా జన్మదినోత్సవం రోజు స్నాతకోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే సత్య సాయి శివైక్యం చెందిన తర్వాత 100వ జయంతి రోజు అంటే ఈనెల 22వ తేదీన సత్యసాయి విశ్వవిద్యాలయం
స్నాతకోత్సవం నిర్వహించడంతోపాటు 23వ తేదీ సత్యసాయి జయంతి వేడుకలు స్టేడియంలో నిర్వహించడానికి వీలుగా ట్రస్టు కార్యక్రమాలను ఖరారు చేసింది. విద్యార్థులకు పట్టాలు కూడా ప్రదానం చేయనున్నారు.
భక్తులకు ఏర్పాట్లు
భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించే దిశగా కూడా శ్రీ సత్యసాయి ట్రస్టు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. వసతి కోసం తాత్కాలిక టెంట్లు, భోజనం, తాగునీరు, స్నాన పదులు, మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేస్తున్నారు. ప్రశాంతి నిలయం తో పాటు ఇందులోకి ప్రవేశించే పడమటి ద్వారం, గణేష్ కూడలి, గోకులంలో కూడా భక్తులకు తాత్కాలిగా వసతి తో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. రోజుకు కనీసం గా లక్ష మందికి అన్న ప్రసాదాలు అందించడానికి వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 13వ తేదీ నుంచి 20 తేది వరకు భక్తులకు పుట్టపర్తిలో మూడు పూటలా అన్న ప్రసాదాల వితరణ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి.
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి ఆర్ జె రత్నాకర్ ఏమంటారంటే..
దేశ, విదేశాల నుంచి భారీగా ప్రముఖులు హాజరు కానుండడంతో పుట్టపర్తి పట్టణం నిఘా నీడలోకి వెళ్లింది. పుట్టపర్తి పూర్తి రక్షణలో ఉంటుందని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి ఆర్ జె రత్నాకర్ తెలిపారు.
విద్యుద్దీపాల కాంతులతో మెరిసిపోతున్న పుట్టపర్తి ప్రశాంతి నిలయం
"సత్యసాయి ట్రస్ట్ సహకారంతో 1.32 కోట్ల రూపాయలతో పుట్టపర్తిలోని 91 ప్రాంతాల్లో 216 నిఘా కెమెరాలు ,నైట్ డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశాం" అని ఈ కార్యక్రమానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఆర్.జే. రత్నాకర్ గత నెలలో స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పుట్టపర్తి పట్టణంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఆమె మామ, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రముఖులు హాజరు కానున్న సందర్భంగా సత్యసాయి విమానాశ్రయం, లాంజ్, హిల్ వ్యూ స్టేడియం, సాయి కుల్వంత్ హాలు తదితర ప్రదేశాల్లో చేయాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులతో పుట్టపర్తి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ నిత్యం సమీక్షిస్తున్నారు.
"ప్రముఖుల భద్రత, సదుపాయాల తోపాటు దేశ,విదేశాల నుంచి వచ్చే యాత్రికులకు ఇబ్బంది లేకుండా పని విభజన చేశాం" అని కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ చెప్పారు.
పుట్టపర్తి మీదుగా.. 350 రైళ్లు..
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లు పుట్టపర్తి మీదుగా ప్రత్యేకంగా నడపడానికి చార్ట్ సిద్ధం చేశారు.
పుట్టపర్తి మీదుగా ప్రస్తుతం 175 రైళ్లు రోజుకు నడుస్తున్నాయి. ఇవి కాకుండా అదనంగా మరో 170 రైళ్లు పుట్టపర్తి మార్గం మీదుగా నడపడానికి డైవర్ట్ చేశారు. ఆ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కూడా అన్ని డివిజన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఉచిత ప్రయాణం
పుట్టపర్తి, ఈ కేంద్రానికి సమీపంలోనే ఉన్న ధర్మవరం రైల్వే స్టేషన్లలో దిగే సాయి భక్తులను ప్రశాంతి నిలయానికి చేర్చడానికి వీలుగా ఏపీఎస్ఆర్టీసీ 200 బస్సులను సిద్ధంగా ఉంచడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని రాయలసీమలోని అనంతపురం, కడప, అన్నమయ్య, పుట్టపర్తి విభజిత జిల్లా ఆర్టీసీ అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ద్వారకా తిరుమల రావు ఆదేశాలు జారీ చేశారు.
"పుట్టపర్తి లోని 23 మార్గాల్లో 150 బస్సులు నడిపే విధంగా కార్యచరణ సిద్ధం చేశాం. పది సుదూర ప్రాంతాలు ప్రయాణించే సర్వీసులతోపాటు శ్రీసత్య సాయి ప్రశాంతి నిలయం నుంచి 20 షటిల్ బస్సులు నడపడానికి మార్గం నిర్దేశించాం. మరో 10 బస్సులు ధర్మవరం రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం కు నడపాలి" అని డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. దీనికోసం
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ఆర్టీసీ డిపో నుంచి 50 బస్సులు, అనంతపురం జిల్లా నుంచి 50, కడప జిల్లా నుంచి 20, అన్నమయ్య జిల్లా నుంచి 30 బస్సులు పుట్టపర్తిలో నడపడానికి ఏర్పాటు చేశారు.
ఉచిత షటిల్ సర్వీసులు..
పుట్టపర్తికి లక్షలాదిగా తరలివచ్చే యాత్రికులకు ఇబ్బంది లేకుండా పుట్టపర్తి రైల్వే స్టేషన్, ధర్మవరం రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం వరకు, మళ్లీ అక్కడ నుంచి రైల్వే స్టేషన్ కు చేర్చడానికి వీలుగా 30 షటిల్ సర్వీసులు నడపాలి అని ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేశారు. పది రోజుల పాటు విధులు నిర్వహించడం ద్వారా యాత్రికుల సేవ కోసం ఐదు మంది డిపో మేనేజర్లు, పదిమంది సూపర్వైజర్లు 15 మంది కంట్రోలర్లు, మరో 20 మంది సహాయకులు అందుబాటులో ఉంచే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి.
"పుట్టపర్తికి మొదట 150 బస్సులు నడపాలని భావించాం. అవి సరిపోవనే ఈ సంఖ్య 200కు పెంచాం" అని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం వరకు తిరిగి ప్రయాణికులను అదే ప్రాంతంలో వదిలే విధంగా బాధ్యతలు వికేంద్రీకరించారు.
పుట్టపర్తిలో బస్సులు నడపడంలో తాత్కాలికంగా మూడు బస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
1. పుట్టపర్తి విమానాశ్రయానికి సమీపంలోని ఎనములపల్లి
2. ప్రశాంతి నిలయానికి పడమటి పక్క (West side)
3. ప్రశాంతి నిలయానికి తూర్పు వైపు (East of Prasaanti nilayam )
పుట్టపర్తి లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక బస్ స్టేషన్ లో అవసరమైన సివిల్, ఎలక్ట్రి క్ పనులను సత్య సాయి ట్రస్ట్ ఏర్పాటు చేసింది.
ఉత్సవాల ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సారధ్యంలో నియమించిన సబ్ కమిటీ బుధవారం పుట్టపర్తిలో సమావేశం కానున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. మంత్రి ఎస్. సవితమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డితో పాటు అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్షించనున్నారు.