అంతరం మరచి.. అదుపు తప్పి..!

ఒకేసారి తనువు చాలించిన యువకుడు, వివాహిత. ఇద్దరి మధ్య 11 ఏళ్ల వ్యత్యాసం. అయినా అనైతిక బంధం. సినిమాలు, సీరియళ్ల ప్రభావం అంటున్న సైకాలజిస్టులు.;

Update: 2025-01-30 01:30 GMT

ప్రేమకు వయసుతో సంబంధం ఉండదంటారు. కులమతాలూ అడ్డంకి కాబోవంటారు. వ్యామోహానికి వావివరసలూ ఉండవంటారు సైకాలజిస్టులు. విశాఖపట్నం జిల్లాలో మూడు రోజుల క్రితం ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సైకాలజిస్టుల మాటలకు ఊతమిస్తున్నాయి. ఆసక్తి రేపుతున్న ఈ వెరైటీ ప్రేమ కథా చిత్రం కథాకమామిషూ ఏమిటంటే? విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో ఓ ప్రేమ జంట (కనకల లక్ష్మి, మొకర ఆదిత్య) ఆత్మహత్యకు పాల్పడింది. సాధారణంగా ప్రేమికుల మధ్య వయసు రెండు మూడేళ్లో, నాలుగైదేళ్లో అటూఇటూగా ఉంటుంది. కానీ ఈ ప్రేమికుల వయసు అంతరం పదకొండేళ్లు. ప్రియుడు వయసు 21 ఏళ్లు.

ప్రియురాలికి 32 ఏళ్లు. ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలుండగా, ఆ యువకుడికి ఇంకా పెళ్లే కాలేదు. అయినా కొన్నేళ్ల క్రితమే వీరిద్దరి మధ్య ప్రేమ? చిగురించింది. ఆపై అనైతిక బంధానికి దారి తీసింది. డ్రైవర్ వృత్తిలో ఉన్న భర్త కళ్లుగప్పి తనకంటే పదకొండేళ్ల చిన్నవాడైన ఆ యువకుడితో ఆమె 'సంసారం' సాగించింది. ఆనోటా ఈనోటా వీరి వ్యవహారం బయటకు పొక్కడంతో 'ఆ అబ్బాయి నా తమ్ముడితో సమానం' అంటూ అనుమానించిన వారందరి నోళ్లు మూయించింది. ఆమె మాటలను నమ్మినోళ్లు నమ్మారు. నమ్మనోళ్లు నమ్మలేదు. ప్రియుడిని తమ్ముడి వరస కలిపాక ఇక ఇద్దరూ బహిరంగంగా సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.

విజయవాడకు చెందిన లక్ష్మికి కృష్ణాపురానికి చెందిన శంకర్తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడు తేజేష్ నాలుగో తరగతి, చిన్న కుమారుడు ధను రెండో తరగతి చదువుతున్నారు. డ్రైవర్ వృత్తితో భర్త రేయింబవళ్లు కష్టపడి తెచ్చే సొమ్ముతో కుటుంబాన్ని పోషించేవాడు. అంతంతమాత్రపు ఆదాయంతో తన ఇద్దరి పిల్లలను ఏ ప్రైవేటు స్కూల్లోనో కాకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చారు. ఈలోగా విలాసాలకు అలవాటు పడిన ప్రియుడి కోసం అవసరమైనప్పుడల్లా అప్పులు చేసి ఇచ్చేది లక్ష్మి. ఇలా ఆమె తన లవర్ బాయ్ కోసం లక్షల రూపాయలు పుట్టిన చోటల్లా అప్పులు చేసి ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. విశాఖ ప్రభుత్వ టీబీ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న ఆదిత్య జులాయిగా తిరిగే వాడు. ఇద్దరూ కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లేవారు.

ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు?

లక్ష్మి, ఆదిత్య ఇద్దరూ కొద్ది వ్యవధిలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న దానిపై గ్రామస్తుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య అనైతిక బంధం ముదిరిన నేపథ్యంలో ఆదిత్య.. లక్ష్మితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అదే విషయాన్ని కొన్నాళ్లుగా చెబుతుండడం, ఆమె అందుకు ససేమిరా అనడం, అలా తనతో రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆదిత్య బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 27న కూడా ఆదిత్య లక్ష్మి ఇంటికి వెళ్లి మరోసారి ఒత్తిడి చేయడం, ఆమె నిరాకరించడం, ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగినట్టు గ్రామస్తులు చెప్పుకుంటున్నారు.

తన వెంట వచ్చేయకపోతే ఇప్పుడే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ లక్ష్మి చీరను తీసుకెళ్లిపోయాడు. సమీపంలోని గొడౌన్కు వెళ్లి తాను ఉరేసుకుని చనిపోతున్నట్టు అక్కడ నుంచి లక్ష్మికి వీడియో కాల్లో చూపించాడు. ఆదిత్య చనిపోయాడని నిర్ధారించుకుని భయంతోనో, ఆదిత్య లేకుండా బతకలేననుకుందో.. లక్ష్మి కూడా వెంటనే తనింట్లో ఉరేసుకుని మరణించింది. ఇలా ఈ అనైతిక ప్రేమికులిద్దరూ నిమిషాల వ్యవధిలోనే తనువు చాలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు వీరిద్దరినీ గోస్తనీ నదీ తీరంలో 50 మీటర్ల దూరంలో వేర్వేరుగా దహన సంస్కారాలు నిర్వహించారు.

భార్య చనిపోతుందని భయంతోనే..

లక్ష్మి, ఆదిత్యల మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందన్న విషయం గతంలోనే లక్ష్మి భర్త శంకర్కు తెలుసని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసి విజయవాడలో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు హుటాహుటీన కృష్ణాపురం వచ్చారు. వీరి అనైతిక బంధం గురించి నీకు తెలుసా? అని అల్లుడిని అడిగారు. అందుకాయన తనకు తెలుసని సమాధానమివ్వడంతో అవాక్కయ్యారు. మరెందుకు నిలదీయలేదని, కనీసం తమకైనా ఎందుకు చెప్పలేదని నిలదీశారు. అలా చెబితే తన భార్య చనిపోతుందని, ఆమె చావుకు తానే కారణమయ్యానని తనను ఇబ్బందులకు గురి చేస్తారని, పిల్లలు అనాథలవుతారన్న భావనతో ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చానని చెప్పాడు. శంకర్ ఆలోచన అమాయకత్వమా? లేక బిడ్డలపై మమకారమా? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. మరోవైపు ఒకే ఒక్క కొడుకు తప్పుదారిలో పయనించి అర్థాంతరంగా దూరమయ్యాడంటూ ఆదిత్య తల్లిదండ్రులు కుమిలి కుమిలి రోదిస్తున్నారు. మొత్తమ్మీద పెళ్లయి పిల్లలున్న మహిళ.. పెళ్లికాని యువకుడితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం, ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడడం విశాఖ జిల్లాలో పెను సంచలనం కలిగించింది.


సైకాలజీ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు


 

సినిమాలు.. సీరియళ్ల ప్రభావమే..

కొన్ని సినిమాలు, సీరియళ్ల ప్రభావం ఈ తరం వారిపై పడుతోంది. వాటిలో చూపించే అక్రమ సంబంధాల వ్యవహారాలు, కొంతమంది సినీనటుల వ్యక్తిగత జీవితాల ప్రభావం వీరిపై చూపుతుంది. ఏ కారణాల వల్లనైనా భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించినా, తాను కోరుకున్నట్టు లేకపోయినా కొందరు ఇలా తనకంటే చిన్నవారితోనైనా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. భర్తలో పొందనిది ప్రియుడితో పొందవచ్చని భావిస్తారు. ఇటీవల కాలంలో బాయ్ ఫ్రెండ్ మోజులో పడి భర్తలను, ప్రియురాళ్ల మోజులో పడి భార్యలను హతమారుస్తున్న వారూ పెరుగుతున్నారు.

ప్రేమికులకు కులమతాలు గాని, వయో బేధాలు గాని ఉండవు. విశాఖ జిల్లా కృష్ణాపురంలో తనకంటే పదకొండేళ్ల చిన్న వాడైన యువకుడితో ప్రేమాయణం సాగించడం, ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడం ఈ కోవలోకి చెందినదే. ఇలాంటి ఘటనలను నియంత్రించడానికి కుటుంబాల్లోనూ, స్కూళ్లు, కాలేజీల్లోనూ అవగాహన శిబిరాలు నిర్వహించాలి. సినిమాలు, సీరియళ్ల సెన్సార్ బోర్డులో సైకాలజిస్టులకు చోటుండాలి' అని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సీనియర్ సైకాలజీ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

Tags:    

Similar News