జగన్‌కు భద్రత కల్పించండి

విజయవాడ స్టేడియంలో జరిగిన మ్యూజికల్‌ నైట్‌కు ఎన్నికల కోడ్‌ వర్తించదా? అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.;

By :  Admin
Update: 2025-02-20 08:18 GMT

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతనం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. గుంటూరు పర్యటనలో జగన్‌కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జెడ్‌ప్లస్‌ కేటగిరి సెక్యూరిటీ ఉంటుంది. జగన్‌ ఎక్కడికి వెళ్లినా.. మాజీ సీఎం హోదాలో ఆయనకు అక్కడ భద్రత కల్పించాలి. కానీ బుధవారం జగన్‌ చేపట్టిన గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్‌ కూడా కనిపించలేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ భద్రత విషయంలో తమకు తీవ్ర ఆందోళన ఉందని వెల్లడించారు. జగన్‌ భద్రత ఆందోళననే గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. జగన్‌కు భద్రత కల్పించాలని గవర్నర్‌ను కోరామన్నారు. దీనిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రులకు భద్రత కల్పించడంలో చట్టం తన పని తాను చేసుకునేలా చేయాలన్నారు. కానీ కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. జగన్‌కు భద్రత కల్పించక పోవడంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు దురుద్దేశాలు తమకు తెలుసన్నారు. జగన్‌ను ఇబ్బంది పెట్టాలనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో భద్రత తగ్గించామా? అంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. గుంటూరు–కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిల నేపథ్యంలో ఎన్నికల కోడ్, కేసుల గురించి కూడా బొత్స సత్యనారాయణ మాట్లాడారు.
ఎన్నికల కోడ్‌ వల్లే జగన్‌కు భద్రత కల్పించలేక పోయామన్న ప్రభుత్వ వాదనను ఆయన తప్పుబట్టారు. జడ్‌ప్లస్‌ కేటగిరీ ఉన్న మాజీ సీఎం జగన్‌ భద్రత ఎన్నికల కోడ్‌కు సంబంధం లేదన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన మ్యూజికల్‌ నైట్‌కు ఎన్నికల కోడ్‌ వర్తించదా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. బుధవారం చేపట్టిన గుంటూరు పర్యటనలో జగన్‌ స్వయంగా తన భద్రత గురించి ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం కావాలనే తనకు భద్రత కల్పించ లేదని ధ్వజమెత్తారు. మరో వైపు జగన్‌తో పాటు మరో ఏడుగురు మాజీ మంత్రులు, వైఎస్‌ఆర్‌సీపీ నేతల మీద ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కేసులు నమోదైన నేపథ్యంలో జగన్‌కు భద్రతను కల్పించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Tags:    

Similar News