విజయవాడలో మీడియా చానల్ మాటున వ్యభిచారం
మెరుపు దాడులు చేపట్టిన పోలీసులు వ్యభిచారం ముఠా గుట్టు రట్టు చేశారు.;
By : Admin
Update: 2025-02-22 09:05 GMT
పోలీసులు ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా.. ఎన్నికఠిన నిబంధనలు విధిస్తున్నా విజయవాడలో స్పా సెంటర్ల మాటున చీకటి దందా మాత్రం ఆగడం లేదు. స్పా సెంటర్ల మాటున వ్యభిచారం నిర్వహిస్తూనే ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను రప్పిస్తూనే ఉన్నారు. వారితో వ్యభిచారం నిర్వహించి జేబులు నింపుకుంటూనే ఉన్నారు. తాజాగా శనివారం వెలుగులోకి వచ్చిన సంఘటనే దీనికి నిదర్శనం.
విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ స్పా సెంటర్‌లో అత్యంత రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీని మీద పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. స్పా సెంటర్‌ను నిర్వహిస్తున్నారని, దీనిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు నిర్థారించారు. దీంతో దీనిపై రైడ్ చేసేందుకు పోలీసులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా శనివారం మధ్యాహ్న సమయంలో విజయవాడ పోలీసులు దాడులు నిర్వహించారు. విజయవాడ మాచవరం సీఐ ప్రకాష్, తన సిబ్బందితో కలిసి మెరుపు దాడులు చేపట్టారు. మీడియా పేరుతో ఏర్పాటు చేసుకున్న ఓ కార్యాలయంలో వ్యభిచారం నిర్వహిస్తున్న తీరుపై పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలోని వెటర్నరీ కాలనీ సర్వీసు రోడ్డులో ఏపీ 23 యూట్యూబ్ చానల్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో స్పా సెంటర్‌ను అత్యంత రహస్యంగా నడుపుతున్నారు. ఇది మీడియాకు సంబంధించిన కార్యాలయం కాబట్టి ఎవరికీ అనుమానాలు తలెత్తవని భావించిన నిర్వాహకులు చీకటి కార్యకలాపాలకు తెర తీసారు. దీనిపైన సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడులు చేపట్టారు. దాదాపు 10 మంది మహిళలు, 13 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మహిళలందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
ఈ యూట్యూబ్ చానల్‌ను అడ్డం పెట్టుకొని చలసాని ప్రసన్న భార్గవ్ అనే వ్యక్తి ఈ చీకటి దందాను సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిర్వాహకుడు చలసాని భార్గవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది వరకు విజయవాడ నగర పోలీసులు స్పా సెంటర్లపై పెద్ద ఎత్తున దాడులు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచారాన్ని బహిర్గతం చేశారు. దాదాపు 271పై స్పా సెంటర్లపై దాడులు చేపట్టారు. స్పా సెంటర్లకు భవనాలు అద్దెకు ఇవ్వొద్దని, వారి వివరాలన్నీ తెలసుకోవాలని భవన యజమానులను పోలీసులు ఆదేశించారు. నిజమైన సెంటర్లని తెలుసుకున్న తర్వాత వారికి అద్దెకు ఇవ్వాలని భవన యజమానులను పోలీసులు ఆదేశించారు. దీంతో పాటుగా సెంటర్లు పెట్టుకునే వాళ్లు పోలీసు, మున్సిపాలిటీ, రెవిన్యూ, లేబర్ డిపార్ట్‌మెంట్‌ల నుంచి ధృవ పత్రాలు పొందాల్సి ఉంటుందని, అవి పొందిన తర్వాతనే సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ఆదేశించారు. కానీ వాటిని పట్టించుకోని నిర్వాహకులు వ్యభిచారం నిర్వహించేందుకు తెగబడుతున్నారు.