భారీ ఏర్పాట్లు 
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సమీపంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే సభకు వచ్చే ముందు శ్రీశైలం దివ్యక్షేత్రానికి వెళ్లి జ్యోతిర్లింగ మూర్తి శివుణ్ణి, శక్తిపీఠంలో కొలువైన భ్రమరాంబిక దేవిని ప్రధాని మోదీ దర్శించుకుంటారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. 2024 ఎన్నికల తర్వాత అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఏపీలో ప్రధాని విశాఖ, అమరావతి ప్రాంతాల్లో పర్యటించారు. గురువారం రాయలసీమ ప్రాంతంలో ప్రధాని పర్యటన జరగనుంది.
కర్నూలులో ప్రధాని హజరు కానున్న భారీ బహిరంగ సభను అంతే సక్సెస్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. వివిధ శాఖల సమన్వయంతో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. గత 15 రోజుల నుంచి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు నిరంతరం కర్నూలు సభను మానిటర్ చేస్తున్నారు. సభకు వచ్చే వారికి భోజన సౌకర్యం మొదులుకుని... పార్కింగ్, సభలో సీటింగ్ ఏర్పాట్లు, మంచినీటి సరఫరా, తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా... అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు ఈ సభకు వస్తారని అంచనా. లక్షలాది సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున దానికి తగ్గ ఏర్పాట్లు, బందోబస్తు చేపట్టారు. సభకు వచ్చే వారికి ప్రయాణ సౌకర్యం కల్పించారు. అలాగే భారీ బందోబస్తు చేశారు. సుమారు 1800 మంది బలగాలతో ప్రధాని సభకు బందోబస్తు పెడుతున్నారు. ఇక ట్రాఫిక్ జాంలు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు పెట్టారు.