ప్రధాని మోదీ శ్రీశైలం టూర్ ఖరారు

మోదీ పర్యటన వివరాలు వెల్లడించిన ఏపీ బీజేపీ చీప్ మాధవ్

Update: 2025-10-07 09:07 GMT

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న శ్రీశైలం క్షేత్ర పర్యటన చేయనున్నారు. ప్రధాని పర్యటన ఖరారైందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. మంగళవారం శ్రీశైలంలో పర్యటించిన మాధవ్ , మోదీ పర్యటించే ప్రదేశాలైన ఛత్రపతి శివాజి స్ఫూర్తి కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. శివాజి రాజదర్బార్, శివాజి ధ్యానమందిరం ఏర్పాట్లను ఎంపీ బైరెడ్డి శబరి తో కలిసి మాధవ్ పరిశీలించారు. ప్రధాన మంత్రి మోదీ మొదటిసారిగా శ్రీశైలం రావడం శుభ పరిణామమని అన్నారు.

సరళీకృత జీఎస్టీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంలో ఈనెల 16న కర్నూలులో ప్రధాని మోదీ పాల్గొంటారని మాధవ్ తెలిపారు.అలాగే ప్రధాని శ్రీశైలం పర్యటనతో క్షేత్ర వైభవం మరింత పెరుగుతుందని మాధవ్ అన్నారు. శ్రీశైలం ప్రాంతం యొక్క విశిష్టత టూరిజం అభివృద్ధి ఈ ప్రాంతం యొక్క విశేషాలు ప్రధాని పర్యటన ద్వారా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందని చెప్పారు. శ్రీశైలం మల్లన్న దర్శనం అనంతరం శివాజి స్ఫూర్తి కేంద్రానికి ప్రధాన మంత్రి మోదీ చేరుకుంటారని మాధవ్ పేర్కొన్నారు.ప్రధాని రాష్ట్ర పర్యటనకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ లో మార్పులు చేసిన తరువాత తగ్గించిన స్లాబ్ లతో పేద, మధ్యతరగతికి ఎంతో లాభం చేకూరుతోందని ప్రభుత్వం చెబుతోంది. జీఎస్టీ పై అవగాహన ప్రచారంలో భాగంగా పలు చోట్ల కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Tags:    

Similar News