'సీమ' వాతావరణాన్ని ఆస్వాదించనున్న రాష్ట్రపతి..

తిరుచానూరులో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న మూడు రోజుల పర్యటన.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-20 05:10 GMT

రాయలసీమ వాతావరణాన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము మూడు రోజులు ఆస్వాదించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమె పర్యటన ఈ రోజు (20వ తేదీ) మధ్యాహ్నం తిరుచానూరు పద్మావతీ అమ్మవారి దర్శనంతో ప్రారంభం అవుతుంది. తిరుమల, పుట్టపర్తి క్షేత్రాల సందర్శనకు వస్తున్న ఆమెకు భద్రత తోపాటు రాష్ట్ర ప్రభుత్వం స్వాగత సన్నాహాలు చేసింది. తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆమె రాత్రికి బస చేస్తారు. వరాహస్వామి ఆలయం, మరుసటి రోజు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు.

తిరుమలకు గతంలో కూడా రాష్ట్రపతి వచ్చారు. ఓ రోజు రాత్రి కూడా ఇక్కడే ఆమె బస చేశారు. ఇక్కడి వాతావరణంలో ఆమె సేదదీరారు. మళ్లీ గురువారం రాత్రి కూడా రాష్ట్రపతి తిరుమలలో బస చేసి, ఇక్కడి ప్రశాంత, చల్లటి వాతావరణం ఆస్వాదించనున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో అంతర్భాగంగా ఉన్న శేషాచలం అడవుల్లో విస్తరించి ఉన్న తిరుమల గిరులు సామాన్యలనే కాదు. ప్రముఖులకు కూడా మధురానుభూతి కలిగిస్తుంది. ఈ వాతావరణంలో సేదదీరే రాష్ర్టపతి ఎలాంటి ఆనందానికి లోనవుతారనేది పర్యటనలో స్పష్టంగా కనిపిస్తుంది.
తిరుచానూరు నుంచి ప్రారంభం
తిరుపతి జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రెండు రోజుల పర్యటన తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయ దర్శనంతో ఈ రోజు (20వ తేదీ) ప్రారంభం అవుతుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము గురువారం మధ్యాహ్నం 3.25 గంటలకు రేణిగుంట విమానాశ్రాయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం వద్దకు 3.55 గంటలకు చేరుకుంటారు. శ్రీపద్మావతీ అమ్మవారిని దర్శించుకున్న తరువాత రెండో ఘాటురోడ్డు నుంచి సాయంత్రం ఐదు గంటలకు తిరుమలకు చేరుకుంటారు. వీవీఐపీ కాటేజీల సముదాయంలో విశ్రాంతి తీసుకున్న తరువాత ఆమె, తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీవారి ఆలయానికి ఎదురుగా పుష్కరిణి వద్ద ఉన్న వరాహస్వామి ఆలయాన్ని రాత్రి తొమ్మిది గంటలకు దర్శించుకుంటారు. అక్కడి నుంచి అతిథి గృహానికి చేరుకుని, బస చేస్తారు.
తిరుమల శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శుక్రవారం ఉదయం పది గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. ఆలయ మర్యాదలతో స్వాగతించే టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, వేదపండితులు రాష్ట్రపతి ముర్ముకు ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలకడం ద్వారా ఆలయంలోకి తీసుకుని వెళతారు. శ్రీవారి మూలవిరాట్టుకు సమీపంలో నిలబడి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రార్థన చేయనున్నారు. ఆ తరువాత ఆలయం నుంచి వెలుపలికి వచ్చి, అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం బయలుదేరి రేణిగుంటకు చేరుకుని హైదరాబాద్ వెళతారు.
రాష్ర్టపతి ద్రౌపదీ ముర్ము పర్యటన నేపథ్యంలో తిరుపతి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకు అడ్వాన్స్ లైజన్ సెక్యూరిటీ పర్యవేక్షించారు. తిరుచానూరు నుంచి మామిడి మార్కెట్ నుంచి తిరుమల బైపాస్ రోడ్డులో అలిపిరి వరకు ఉన్న ఫ్లైఒవర్ రహదారి బుధవారం నుంచే మూసేశారు. రాష్ట్రపతి ముర్ము ఈ రోజు ఇదే మార్గంలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తిరుమల పర్యటన ముగించుకుని శుక్రవారం ఆమె హైదరాబాద్ బయలుదేరి వెళతారు.
సీమ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ..
రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆమె రాయలసీమ జిల్లాల మీదుగానే ప్రయాణించనున్నారు. గగనతలం నుంచే ఈ ప్రాంతంలోని దృశ్యాలను కూడా చూసే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్ లో ఈ నెల 21వ తేదీ ఏర్పాటు చేసిన భారతీయ కళోత్సవ్ -2025ను రాష్ర్టపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించి, ముఖ్యఅతిథి ప్రసంగం చేయనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి, హైదరాబాద్ వాతావరణంలో సేదదీరుతారు.
పుట్టపర్తికి రాక
సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 22వ తేదీ హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరే ఆమె ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయికుల్వంత్ హాలులోని సత్యసాయి సమాధిని దర్శించుని, ప్రత్యేక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు.
Tags:    

Similar News