ఆర్జీవీకి నోటీసులిచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల అనంతరం తెరపైకి వచ్చిన రామ్‌గోపాల్ వర్మ కేసు.
By : Admin
Update: 2024-11-13 08:26 GMT
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కేసుల అంశం ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులను దాటింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పాకింది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై ∙ఏపీలో కేసు నమో చేశారు. ఆ మేరకు విచారణకు రావలని హైదరాబాద్ వెళ్లిన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు స్వయంగా రామ్‌గోపాల్ వర్మ ఇంటికెళ్లి ఆయనకు నోటీసులు అందజేశారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో రామ్ గోపాల్ వర్మ మీద పోలీసు కేసు నమోదు చేశారు. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో రామ్‌గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ అధినేత, నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు, వారి వ్యక్తిత్వాలను కించరిచే విధంగా పోస్టులు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఐటి యాక్ట్ కింద రామ్ గోపాల్ వర్మ మీద నవంబర్ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలని భావించిన పోలీసులు ఆర్జీవిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆర్జీవికి నోటీసులు అందించాలని భావించారు. దీని కోసం ఎస్‌ఐ
శివరామయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసుల బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్లారు. బుధవారం ఉదయం రామ్‌గోపాల్ వర్మ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. నవంబర్ 19న మద్దిపాడు పీఎస్‌లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మరో వైపు ఆర్జీవికి ఇది వరకే పోలీసులు నోటీసులిచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం ఆన్ లైన్‌లో ఆర్జీవికి నోటీసులు పంపినట్లు తెలిసింది. అయితే నేరుగా ఇంటికెళ్లి ఆర్జీవీకి నోటీసులు ఇవ్వాలని భావించిన పోలీసులు ఆ మేరకు బుధవారం నోటీసులు ఆర్జీవికి అందించారు. పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నట్లు ఆర్జీవీ దిగిన ఫొటో తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యల అనంతరం ఆర్జీవీ కేసు తెరపైకొచ్చింది.