జనంతో నిండిన ప్రకాశం బ్యారేజ్‌

విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ జనంతో ఆదివారం సాయంత్రం కిటకిట లాడింది. రాత్రి బాగా పొద్దుపోయే వరకు జనం సందడి కొనసాగుతూనే ఉంది.

Update: 2024-09-01 14:25 GMT

విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ జనంతో నిండిపోయింది. వరదలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతుండటంతో అధికారులు గేట్లన్నీ ఎత్తివేశారు. దీంతో నది కనకదుర్గమ్మ వారది కింద నుంచి సముద్రం వైపుకు దూకుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అక్కడక్కడ పోలీసు బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. బ్యారేజీ పైభాగాన, రెండు వైపుల జనంతో ప్రాజెక్టు నిండిపోయింది. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి ఇంత భారీ స్థాయిలో నీరు ప్రవహించడం ఇదే మొదటి సారి. శనివారం నుంచి వరదనీరు వస్తూనే ఉంది. ఆదివారం ఉధృతి పెరగటంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 7,69,443 క్యూసెక్స్‌గా ఉంది. కృష్ణా బ్యారేజ్‌ లోపలి భాగంలో ఉన్న భవానీ ద్వీపంతో కాక మరో రెండు చిన్న ద్వీపాలు కూడా దాదాపు నీటిలో పూర్తి స్థాయిలో మునిగాయి. ద్వీపంలోకి పాములు, తేళ్లు, కప్పల తాకిడి ఎక్కువగా ఉందని అక్కడి వారు తెలిపారు. కృష్ణానది కరకట్ట లోపలి భాగంలో నిర్మించిన భవనాల వద్దకు నీరు చేరింది.

Delete Edit
మార్మోగిన దుర్గమ్మ నినాదం
కృష్ణానదీ జలాల హోరుకు తగ్గట్టుగా నదీ పరివాహక ప్రాంతమంతా మైకులు ఏర్పాటు చేయడంతో ‘ఓం శ్రీ కనక దుర్గయె నమః’ అంటూ ఓంకార నాధంతో మార్మోగుతూనే ఉంది. నదీ ప్రవాహాన్ని చూసేందుకు వచ్చిన వారు ఈ ఓంకార నాధాన్ని కూడా మనసులో అనుకూంటూ తిరగటం కనిపించింది. నది కింది భాగంలో ఇరువైపుల ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలపై ప్రజలు నిలబడి నీటి ప్రవాహాన్ని తిలకిస్తూ ఆనందించారు. చాలా మంది నదిని చూసిన తరువాత దుర్గమ్మ గుడికి కూడా వెళ్లి వచ్చారు. బ్యారేజీకి రంగురంగుల విద్యుత్‌ బల్పులు అమర్చడంతో దేదీప్యమానమైన కాంతులతో బ్యారేజీ వెలిగిపోతోంది. రాత్రి పూట దుర్గమ్మ వారది పై నుంచి ఎంతో మంది ప్రజలు తమ వాహనాలు నిలిపి ప్రకాశం బ్యారేజీపై చూసి మురిసిపోతూ కనిపించారు.
Delete Edit
పలు రకాల చర్చ
ఎప్పుడో ఒక రోజు కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపోగు అందుకుంటుందని, అప్పుడు విజయవాడ నగరం అంతా నదీ జలాల్లో కొట్టుకుపోతుందనే చర్చ అక్కడక్కడా వినిపించింది. నమో కృష్ణమ్మ అంటూ కొందరు వృద్ధులు నదీ జలాలకు దండం పెడుతూ కనిపించారు. నది పరివాహక ప్రాంతమైన ఉత్తరం వైపు ఉన్న శనైశ్చ్వరాలయం వరకు ప్రజలు గుంపులుగుంపులుగా ఉన్నారు. లక్షల క్యూసెక్స్‌లో నీరు ప్రవహించడంతో నది నిండుగా రెండు వైపులా కనిపించింది. నదిలో ప్రస్తుతం ఇరిగేషన్‌ శాఖ అధికారుల అంచనాల ప్రకారం డిజైన్‌ను దాటి నీరు ప్రవహిస్తోందని, ఏ మాత్రం నీటి ప్రవాహం పెరిగినా బ్యారేజీకి, స్థానికులకు ప్రమాదం ఉండే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది.
Delete Edit
కృష్ణలంకను కాపాడిన రిటర్నింగ్‌ వాల్‌
ఎప్పుడు వరదలు వచ్చినా కృష్ణానది అంచున నిర్మించిన కృష్ణ లంకలోని ఇండ్లలోకి నీరు పూర్తి స్థాయిలో వస్తుంది. దీంతో ప్రతి సంవత్సరం కృష్ణ లంక వరదల్లో మునిగిపోయిందంటూ గగ్గోలు పెట్టే వారు నిజానికి నది భాగంలోని ప్రాంతాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించారు. దీంతో నది ప్రవహించే టప్పుడు వరద నీరు రాకుండా ఎలావుంటుందనేది పలువురి ప్రశ్న. 2014లో అధికారం చేపట్టిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నదికి దక్షిణం వైపున ఉన్న కృష్ణలంకను కాపాడాలంటే ఒక్కటే మార్గమని భావించి సుమారు ఐదు వందల కోట్లతో రిటర్నింగ్‌ వాల్‌ నిర్మించేందుకు నిర్ణయించి పనులు చేపట్టారు. ఆ తరువాత అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొద్ది రోజులు పనులు ఆపేసినా ఆ తరువాత రిటర్నింగ్‌ వాల్‌ను పూర్తి చేసింది. దీంతో కృష్ణ లంకతో పాటు రంగుతోట, బాలాజీ నగర్, రామలింగేశ్వర నగర్‌ వంటి ప్రాంతాలన్నీ నీటి మునక నుంచి తప్పించుకున్నాయి. వేల ఇళ్లలోని ప్రజలు వరద ముప్పు నుంచి తప్పించుకోగలిగారు.
Tags:    

Similar News