జైలు నుంచి ఆసుపత్రికి పోసాని తరలింపు
రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.;
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల మీద అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర దూషణలు చేశారనే ఆరోపణలతో అరెస్టై జైలులో ఉన్న ప్రముఖ సినీ నటుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను రాజంపేట సబ్ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈసీజీతో పాటు పలు రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు పోసానికి బీపీతో పాటు ఈసీజీలో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్య చికిత్సల కోసం పోసానిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
శుక్రవారం రాత్రి నుంచే పోసాని చాతి నొప్పితో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఆయనకు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కొంత కాలంగా ఆయన కడుపులో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. దీంతో పాటుగా ఎడమ భుజం నొప్పితో పాటు తీవ్రమైన గొంతు నొప్పితో కూడా బాధపడుతున్నారు. దీని వల్ల పోసాని మాట్లాడేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఉంది. అబ్డామిన హెర్నియా సర్జరీలో ఇన్‌ఫెక్షన్ సమస్య ఉంది. ఇటీవల ఆయన హెర్నియా సర్జరీ చేయించుకున్నారు. నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్సలు తీసుకున్నారు. మూడు సార్లు వోకల్ కార్టు సర్జరీ కూడా జరిగింది. అరెస్టుకు ముందు కొద్ది రోజుల క్రితం పోసాని గుండెకు సంబంధించిన చికిత్సలు చేయించుకున్నారు. దీంతో గుండె ఆపరేషన్ చేసిన వైద్యులు పోసానికి స్టంట్ కూడా వేశారు. స్టంట్ వేయించుకున్న తర్వాత చాతి నొప్పితో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది.