కడపపై కేంద్రీకృతమైన రాజకీయ తుఫాన్

రెండు జెడ్పీటీసీ స్థానాల ఉపఎన్నికల పోలింగ్ సరళి ఎలా ఉందంటే..;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-12 05:59 GMT

కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం నుంచి ఘర్షణల మధ్య ప్రారంభమైంది. ఈ ఎన్నికపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ప్రస్తుతం రెండు కేంద్రాల్లో ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభైంది. మధ్యాహ్నం తరువాత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఓటర్లు భారీగా బారులుదీరడం, ఘర్షణల నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉందంటే...

కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ స్థానంతో పాటు రాజంపేట నియోవజకవర్గం ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
పులివెందులో ఏకంగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఒంటిమిట్టలో ఎన్నికల ప్రక్రియ బందోబస్తు కోసం స్వయంగా రంగంలోకి దిగారు. రెండు జెడ్పీటీసీ స్థానాల్లో మంగళవారం ఉదయం 10 గంటల వరకు పోల్ అయిన ఓట్ల వివరాలు ఇవి.
పులివెందుల జెడ్పీటీసీ స్థానం
పోటీలో ఉన్న అభ్యర్థులు టీడీపీ నుంచి మాజీ ఎంఎల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డి జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈమెపై వైసీపీ నుంచి హేమంత్ రెడ్డిని పోటీకి దింపారు. ఇక్కడ టీడీపీ నేతలు బీటెక్ రవి, ఎంఎల్సీ రాంగోపాలరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్. జగన్ పులివెందులలో అప్రహతంగా సాగిస్తున్న 50 ఏళ్ల తమ కుటుంబ ఆధిపత్యం అనే ప్రతిష్ఠ కోసం పోరాటం చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది.
పోలింగ్ కేంద్రాలు 15
ఓటర్లు 10,601
ఇప్పటి వరకు పోల్ అయినవి 2,222
శాతం 20.96
కడప జిల్లాలోనే రాజంపేట నియోజవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు ఆయన జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. ఒంటిమిట్ట నుంచి జెడ్పీటీసీ సభ్యుడుగా ఉన్న ఆయన ఆ పదవికి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఈ కేంద్రంలో కూడా వైసీపీ నుంచి మండపంపల్లెక చెందిన ముద్దుకృష్ణారెడ్డి జెడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయనపై టీడీపీ అభ్యర్థిగా చిన్నిపరెడ్డిపల్లెకు చెందిన ఇరగంరెడ్డి వెంకట సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు. వారిద్దరి మధ్య అనడం కంటే, టీడీపీ, వైసీపీ నేతల మధ్య పోరాటం జరుగుతోంది.
ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి విజయం కోసం జిల్లాకు చెందిన మంత్రి మండిపల్లె రాంప్రసాదరెడ్డి ప్రతి పల్లె తిరిగి, నాయకులను ఏకం చేశారు.
విజయం ఎవరిది?
ఒంటిమిట్టలో పోటీ తీవ్రంగా ఉంది. మొత్తం 13 పంచాయతీలు మండలంలో ఉంటే, ఇందులో రెడ్డి సామాజికవర్గం ఆరు పంచాయతీల్లో ఉంది. టీడీపీ, వైసీపీ నుంచి రెడ్డి సామాజికవర్గం నుంచే పోటీకి దింపారు. ఇక్కడ నజరానాలే కీలకంగా వ్యవహరించే పరిస్థితి ఉందని తెలిసింది. పోలింగ్ కు ముందు ఓటుకు నోటు కీలకపాత్ర పోషించినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ నేతల పంపకాలు ఎక్కువగా ఉండడంతో కలవరం చెందిన వైసీపీ నేతలు మరో నోటు అధికంగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితిలో స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థికి విజయావకాశాలు ఉన్నట్లు అక్కడి ఓటింగ్ సరళిని పరిశీలించిన పరిశీలకులు, మీడియా ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానం
పోలింగ్ కేంద్రాలు 30
ఓటర్లు 24,606
పది గంటల వరకు పోల్ 3,658
స్వల్ప ఘర్షణలు, ఓటర్లు భారీగా బారులుదీరిన నేపథ్యంలో పోలింగ్ శాతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలెంగ్ శాతం ఆధారంగా విజయకాశాలకంటే మెజారీటీ ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు.
Tags:    

Similar News