దారితప్పిన కాలినడక ప్రయాణం..రాత్రంతా అడవిలోనే ఆ జంట
కైలేష్ అనే వ్యక్తి శ్రీను, అతని భార్య ధనలక్ష్మి చేత చేపల వేట చేయించుకున్నాడు. కూలీ ఇవ్వలేదు. కాలినడకన ఊరికి బయలుదేరారు. భార్య నాలుగు నెలల గర్భవతి.;
చేతులో డబ్బుల్లేవు. పని చేయించుకున్న వ్యక్తి కూలీ ఇవ్వలేదు. సొంత గూటికి చేరుకోవాలని అనుకున్నారు. డబ్బుల్లేక పోవడంతో బస్సుల్లో ప్రయాణించే అవకాశం లేదు. భార్య నాలుగు నెలల గర్భిణీ. అయినా ధైర్యం చేశారు. కాలినడకనే ప్రయాణం సాగించారు. రోడ్డు మార్గం వారికి తెలియక పోవడంతో కొంత దూరం వెళ్లిన తర్వాత ఓ వ్యక్తిని దారి అడిగారు. అతను ఓ దారి చూపించాడు. ఆ దారి గుండా నడక సాగించారు. నడిచే కొద్ది అడవే వస్తోంది.. కానీ ఊరు రావడం లేదు. అలా రాత్రంతా ఆ అడవిలో తిరుగుతూనే ఉన్నారు. తర్వాత తెలిసింది వారికి దారి తప్పి పోయామని. తర్వాత రోజు 100కి డయిల్ చేశారు. ఎక్కడ ఉన్నారో పోలీసులకు కూడా చెప్పలేక పోయారు. చివరికి బాధితుల ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారు ఉన్న చోటుకు పోలీసులు వెళ్లి కాపాడి బయటకు తీసుకొచ్చి.. వారి సొంతూరుకు పంపించారు. పని చేయించుకున్న వాడు కూలీ డబ్బులు ఇవ్వని కారణంగా ఆ పేద జంట నరకం అనుభవించారు. ఈ అమానవీయ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.