కలెక్టర్ సమక్షంలో పోలీసులే రిగ్గింగ్
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైఎలక్షన్ తీరుపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.;
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైఎలక్షన్ లొ కలెక్టర్ సమక్షంలోనే పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్‌లకు పాల్పడ్డారని, దొంగ ఓట్లు వేయించారని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాతూ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం లేదనే విషయం ఈ ఉప ఎన్నికల్లో రుజువైందన్నారు. తమ పార్టీ నాయకులు బూత్‌లలో లేకుండా చేసి రిగ్గింగ్‌లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించడం తానెప్పుడూ చూడలేదన్నారు. ఇదే తొలిసారని జగన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు లేవనడానికి ఈ ఉప ఎన్నికలే నిదర్శనం అన్నారు. ఇలాంటి వాతావరణంలో ఎన్నికలు జరపడం దేనికి అని ఆయన ప్రశ్నించారు. చంబల్ లోయలో బందిపోట్లు తలపించే విధంగా ఇక్కడ వ్యవహరించారు. సాక్షాత్తూ పోలీసులే దగ్గరుండి మరీ ఈ వ్యవహారాన్ని ప్రోత్సహించారని మండిపడ్డారు.
ప్రజలు మీకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంటే ఈ ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల సమక్షంలో పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు నిర్వహించండి అని ఈ సందర్భంగా చంద్రబాబుకు జగన్ సవాల్ విసిరారు. అడ్డగోలుగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఎవరెవరు పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకున్నారో తన వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు పోలింగ్ బూత్‌లను మార్చేచి వారికి ఇష్టం వచ్చినట్లు ఓట్లు వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు ఓటర్లను వెళ్లనీయకుండా దారిలోనే టీడీపీ మూకలు అడ్డుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలను పులివెందులకు తీసుకొచ్చి పాగా వేయించి పోలీసులే దగ్గరుండి ఓట్లు వేయించారని మండిపడ్డారు.
పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారని ప్రతి బూత్‌లో 400 మందికి పైగా తిష్టవేసే విధంగా పోలీసులు వ్యవహరించారని తప్పుపట్టారు. ఒక్కో ఓటరుకు ఒక్కో రౌడీని పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సవిత, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, చైతన్య రెడ్డి మనుషులు ప్రతి పోలింగ్ బూత్‌లో ఉండి టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు వేయించారని ఆరోపించారు. బీటెక్ రవి అసలు పులివెందుల రూరల్ ఓటరు కానేకాదని, కానీ కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని విమర్శించారు. ఓట్లు వేస్తారనే నమ్మకం ఉంటే ఇలాంటి పనులు చేయడం ఏమిటని చంద్రబాబును ప్రశ్నించారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికలు కూడా ఇలాగే చంద్రబాబు నిర్వహించడాని మండిపడ్డారు.