మహా మాయలోళ్లు ..!

రైతులకు మాయమాటలతో ట్రాక్టర్లు లీజుకు తీసుకున్నారు. వాటిని విక్రయించి జల్సాలు చేశారు. చివరికి ఆ యువకులు కటకటాలు లెక్కించక తప్పలేదు.

Update: 2024-04-17 15:17 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: జల్సాలకు అలవాటు పడిన యువకులు రైతుల నుంచి ట్రాక్టర్లు లీజుకు తీసుకున్నారు. మూడో కంటికి తెలియకుండా వాటిని విక్రయించారు. వీటిని రిజిస్ట్రేషన్ చేయిస్తామని ఇంకొందరి వద్ద డబ్బు వసూలు చేసి స్వాహా చేశారు. తాడిమర్రి గ్రామానికి చెందిన రైతు దేవర రామమోహన్ ఇచ్చిన ఫిర్యాదుతో.. తప్పించుకు తిరుగుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. తక్కువ వ్యవధిలోనే రూ.4.56 కోట్ల విలువైన 57 ట్రాక్టర్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు. ఆ వివరాలను సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్పీ మాధవ రెడ్డి బుధవారం తాడిమర్రి పోలీస్ స్టేషన్‌లో వెల్లడించారు.

లీజు పేరుతో టోకరా..

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎన్‌ఆర్‌కే బ్రిక్ ఇండస్ట్రీస్‌లో మట్టి తోలకానికి ట్రాక్టర్లు లీజుకు కావాలని రైతులను నమ్మించారు. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నల్లజంగరి రవికుమార్, పులివెందుల పట్టణానికి చెందిన లోమడ భయ్యా రెడ్డి, కాకర్ల హాజిపిరా, బోగిరెడ్డి చంద్ర ఓబులరెడ్డి, పెసల నాగమల్లారెడ్డి, తలారి రామలింగేశ్వరరావు, చిన్న జయచంద్ర రెడ్డి , మధుసూదన రెడ్డి, సాకే రామమోహన్, సుదర్శన్ రెడ్డి ముఠాగా ఏర్పడ్డారు.

వ్యూహం అమలు

ఇటుకలు తయారు చేసే పరిశ్రమకు మట్టి తరలించడానికి ట్రాక్టర్లు లీజుకు కావాలని సత్య సాయి జిల్లా తాడిమర్రి కనేకల్ ప్రాంతాలకు చెందిన రైతులను నమ్మించారు. వారి నుంచి తీసుకున్న ట్రాక్టర్లను పులివెందుల పరిసర ప్రాంతాల్లో విక్రయించారు. రైతులకు అనుమానం రాకుండా ప్రతినెల ట్రాక్టర్‌కు రూ.25 వేలు చెల్లించారు. ఆ తర్వాత రైతులకు కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

 ఇంకొందరికి కూడా టోకరా..

రైతులకు నుంచి లీజు పేరిట తీసుకున్న ట్రాక్టర్లను విక్రయించిన నిందితులు.. వాటిని రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ మరి కొందరిని మోసం చేసి డబ్బు తీసుకున్నారు. ఆ మోసగాళ్లు అంతటితో ఆగలేదు. కడప, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, గుంటూరు జిల్లాలలోని వివిధ గ్రామాలలో తక్కువ రేటుకు స్థలాన్ని మీ పేరు మీద రిజిస్టర్ చేస్తామని వారుతో అగ్రిమెంట్ రాయించుకుని ఆ తరువాత రిజిస్టర్ చేయిస్తామని వారిని కూడా మోసగించారు. డబ్బుతో వారంతా విందులు వినోదాలతో జల్సా చేశారు.

తర్వాత ఏమైంది...

తమ వద్ద ట్రాక్టర్లు లీజుకు తీసుకున్న యువకులు కనిపించడం లేదు. వారు సొమ్ము ఇవ్వడం లేదంటూ తాడిమర్రి గ్రామానికి చెందిన రైతు దేవర రామమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. చురుగ్గా సాగించిన దర్యాప్తు ద్వారా నిందితులు.. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నల్లజంగరి రవికుమార్, పులివెందుల పట్టణానికి చెందిన లోమడ భయ్యా రెడ్డినీ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దీంతో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చిందని సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి వివరించారు.

" జల్సాలకు అలవాటు పడిన యువకులు, సులభంగా డబ్బు సంపాదించాలన్న యావతో.. ఈ నేరానికి పాల్పడ్డారని చెప్పారు. పొరుగు జిల్లాల్లో విక్రయించిన రు. 4.56 కోట్ల విలువైన 57 ట్రాక్టర్లను స్వల్ప సమయంలోనే స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం నిందితులను తాడిమర్రి మండలం దాడి తోట చెక్ పోస్ట్ వద్ద అరెస్టు చేశామన్నారు. వారిలో.. ప్రధాన నిందితులు రవికుమార్, లోమడ బయ్యారెడ్డి, భోగి రెడ్డి చంద్రబాబు రెడ్డి, పెసల నాగ మల్లారెడ్డి, తలారి రామలింగేశ్వర రావు, జై చంద్రారెడ్డి, మధుసూదన్ రెడ్డి, సాకే రామ్మోహన్, సుదర్శన్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డిని అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు.

" జల్సాలకు అలవాటు పడిన వారు ఇలాంటి నేరాలు పాల్పడతారని, అత్యాశకు పోయి మోసపోవద్దు" అని ఆయన రైతులకు హితవు పలికారు. ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీసులు సంప్రదిస్తే న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కేసును చేదించడంలో చొరవ చూపిన ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు, ముదిగోపా రూరల్ సీఐ హెచ్ కృష్ణంరాజు, ఎస్సైలు సిబ్బందిని ఆయన అభినందించారు.

Tags:    

Similar News