‘వైసీపీ పాలనలో అంతా అవినీతే’.. మోదీ సంచలన వ్యాఖ్యలు

రాజమండ్రిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వైసీపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి శూన్యమని విమర్శించారు.

Update: 2024-05-06 12:07 GMT

‘వైసీపీ హయాంలో రాష్ట్రంలో అవినీతి వెళ్లివిరిసింది’ అని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపాన నిషేధం చేస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏం చేసిందని మోదీ ప్రశ్నించారు. తీరా అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం దందా సాగించిందని, ఇష్టమొచ్చిన బ్రాండ్‌ల పేరిట ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడిందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో నిర్వహించిన కూటమి ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఇదివరకు లేని విధంగా ఈసారి ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు మోదీ.

రాజమండ్రిలో నిర్వహించిన సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ‘‘గోదావరి మాతకు ప్రణామాలు’ అంటూ ప్రారంభించిన ప్రజలకు ఆకట్టుకున్నారు. ఈ నేలపైనే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారని, ఈ నేలపై నుంచే ఇప్పుడు రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నామంటూ రానున్న ఎన్నికల్లో కూటమిదే గెలుపు అన్న ధీమాను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే 2024 ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రానికి జరిగిన మంచి ఏమీ లేదని, ఈ ఐదేళ్లలో అవినీతి, అక్రమాలు మాత్రం జెట్‌స్పీడ్‌లో దూసుకెళ్లాయంటూ విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆంధ్ర ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని, రాష్ట్రవిభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే ఇప్పుడు వైసీపీకి పట్టనుందని అభిప్రాయపడ్డారు మోదీ.

వైసీపీ ప్రభుత్వానికి వంద మార్కులు

వైసీపీ ప్రభుత్వానికి అవినీతి చేయడంలో వందకు వంద మార్కులు వస్తాయని, అభివృద్ధిలో మాత్రం గుడ్డి సున్నా వస్తుందని ప్రధాని మోదీ చురకలంటించారు. రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి చెందాలంటే అంది ఎన్‌డీఏ కూటమితోనే సాధ్యమని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని, అలివిమాలిన స్థాయిలో అప్పులు తీసుకొచ్చి ప్రజల నెత్తిన అధికర భారం మోపుతుందని, సంక్షేమం పేరిట ఒకచేత్తో రూ.10 ఇస్తూ మరోచేత్తో అధిక ధరంటూ రూ.100 లాక్కుంటుందని ఎద్దేవా చేశారు. దేశం అభివృద్ధివైపు పరుగులు పెడుతున్న క్రమంలో రాష్ట్రం కూడా జెట్ స్పీడ్‌లో అభివృద్ధి చెందాలని, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లు అభివృద్ధి విషయంలో అట్టడుగున ఉందని విమర్శలు చేశారు.

నైపుణ్యం ఈ నేల సొత్తు

ప్రతిభావంతులైన, నైపుణ్యవంతులైన యువతకు ఆంధ్రప్రదేశ్ నెలవు అని ప్రధాని మోదీ చెప్పారు.‘‘టెక్నాలజీ విషయంలో ఏపీ యువత శక్తిసామర్థ్యాలను ప్రపంచం గుర్తించింది. వారి ప్రతిభను రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకుంటే ఆంధ్రను ఎవరూ అడ్డుకోలేరు’’అని వివరించారు. యువతకు టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలు రావాలంటే.. వాటిని తీసుకురావడం చంద్రబాబు, బీజేపీ వల్లే సాధ్యమవుతుందని, ఐదేళ్లలో రాష్ట్రానికి వచ్చిన సంస్థల సంఖ్యను వేళ్లపైన లెక్కేయొచ్చని, అదే రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన సంస్థలకు లెక్కలేదని దుయ్యబట్టారు నరేంద్ర మోదీ.

రాజదాని పేరిట రాష్ట్రాన్ని లూటీ

‘‘ముడు రాజధానులు తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధానులు తీసుకురాలేదు కానీ రాజధాని పేరిట ఏపీని లూటీ చేశారు. మద్యం నిషేధం నినాదంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు సిండికేట్‌లా మారింది. వైసీపీ అవినీతి నిర్వహణ వచ్చినంత బాగా ఆర్థిక నిర్వహణ రాదు. తమ జేబులు నింపుకోవడానికి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని హామీలపైన హామీలు ఇచ్చిన వైసీపీ.. పూర్తి చేసిందా? పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. కానీ ప్రాజెక్ట్ మాత్రం పూర్తి కాలేదు. అదే విధంగా రాజధాని నిర్మాణం కోసం కూడా కేంద్రం రూ.15 వేల కోట్లు ఇవ్వాలని యోచించింది. కానీ కేంద్రం నిధులను వైసీపీ అందుకోలేకపోయింది’’ అని వెల్లడించారు మోది.

విశాఖ-చెన్నై కారిడార్ నిర్మాణం

రాముడి చరిత్రను ఇంటింటికీ తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి ఎన్‌టీఆర్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠను కూడా ఆ పార్టీ బహిష్కరించిందని, పార్టీని దిక్కరించి ఆ కార్యక్రమానికి హాజరైన ఒకనేతను కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీ నుంచి బహిష్కరించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఏపీకి మోదీ గ్యారెంటీ, చంద్రబాబు నేతృత్వం, పవన్ విశ్వాసం ఉన్నాయని, కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News