విశాఖ సీఐఐ సదస్సుకు చీఫ్ గెస్ట్ గా పీఎం మోదీ
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ ను నిర్వహించనున్నారు.
రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను భారత ఆర్థిక, సాంకేతిక ప్రగతిలో అగ్రగామిగా ప్రతిష్ఠించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సన్నాహకాలపై సచివాలయంలో సోమవారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సీఐఐ సదస్సుకు ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. అలాగే వివిధ దేశాల వాణిజ్య మంత్రులను, లీడింగ్-గ్లోబల్ సీఈవోలను ఆహ్వానించాలని నిర్దేశించారు. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, పాలసీ థింకర్లు, అకడమిక్స్‌కు సదస్సులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్లోబల్ టెక్ ట్రాన్సఫర్మేషన్, గ్లోబల్ ట్రస్ట్ పెంచుకోవడం, గ్లోబల్ ట్రేడ్‌లో దేశం వాటా పెరగడం సదస్సు లక్ష్యంగా ఉండాలని సూచించారు. అతిథులకు అన్ని సౌకర్యాలతో ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని, విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు.