అమరావతి కడుతున్నాం... చందాలు ఇవ్వండి
ముఖ్యమంత్రి మూడో సారి అమరావతి కోసం చందాలు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. జోలెపట్టినా, క్యూఆర్ కోడ్ లతో నిధులు సేకరించినా ఆయనకు ఆయనే సాటి.;
అమరావతి రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి వివిధ వనరులను ఆశ్రయించారు. మొదటి సారి జోలెబట్టి చందాలు అడగడం ఆయన నాయకత్వ శైలిలో భాగంగా అందరూ పరిగణించారు. ఆ తరువాత ఎన్ఆర్ఐల నుంచి భారీ మొత్తంలో విరాళాలు వచ్చాయి. 2014-2019 కాలంలో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా లక్షల కోట్ల రూపాయల విలువైన భూమి సమీకరణ జరిగింది. కోట్ల రూపాయాలు విరాళాలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ విరాళాల కోసం క్యూఆర్ కోడ్‌ల ద్వారా సేకరణ ప్రక్రియ మొదలైంది.
రాజధాని నిర్మాణం కోసం ప్రస్తుతం వరల్డ్ బ్యాంకు రూ.15,000 కోట్ల అప్పు ఇవ్వడానికి అంగీకరించింది. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ కూడా రూ.13,600 కోట్ల సహాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ.1,400 కోట్లతో మద్దతు ఇస్తోంది. అదనంగా హడ్కో నుంచి రూ.11,000 కోట్ల రుణం రాబోతోంది. ఈ విధంగా విదేశీ బ్యాంకుల మద్దతు లభిస్తున్నా, చంద్రబాబు ప్రజలను మరింత విరాళాల కోసం ప్రోత్సహిస్తున్నారు. దీని వెనకి కారణం రాజధాని నిర్మాణ ఖర్చు రూ.64,721 కోట్లుగా అంచనా. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రజా సహకారాన్ని ఆశ్రయించడం కనిపిస్తోంది. డబ్బులు ఉన్న వారు, ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందే వారు విరాళాలు ఇస్తున్నారు.
చందాలు అడగడం సమంజసమని ఆయన అనుచరులు భావిస్తే, విమర్శకులు దీనిని అసమంజసంగా భావిస్తున్నారు. రాజధాని ఒక ప్రభుత్వ ప్రాజెక్టు కాగా, ప్రజల నుంచి విరాళాలు సేకరించడం ఆర్థిక భారం ప్రజలపై వేసే చర్యగా కనిపిస్తోంది. ఇది ప్రజల్లో అసంతృప్తిని పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు అమలవడం లేదు. ఈ నేపథ్యంలో చందాలు అడగడం రాజకీయంగా ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబు ఆర్థిక నిర్వహణ ఆధారంగా రాజధాని నిర్మాణాన్ని స్వావలంబన మార్గంలో నడిపించాలని ఆలోచిస్తున్నారని అర్థమవుతోంది. అయితే ప్రభుత్వ ఆర్థిక సమస్యలు, అంతర్జాతీయ అప్పులపై ఆధారపడకూడదని భావించి ప్రజా దానాలను ప్రోత్సహించడం దీర్ఘకాలంలో సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణం ప్రజల మద్దతుతో సాధ్యమైనా.. దాని పారదర్శకత, నిధుల వినియోగం పై సంతృప్తి లేకపోతే వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది.
విరాళాలు ఆర్థిక స్వావలంబన కోసం అవసరమైనా, ప్రజల మద్దతు కోసం పారదర్శకత, హామీల అమలు ముఖ్యం.