ఎపిలో ప్రజల తీర్పు ఎప్పుడూ వన్‌సైడే

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లు ఎప్పుడూ తీర్పు వన్‌సైడే ఇచ్చారు. చరిత్రలో మొదటి సారిగా 2024 ఎన్నికల్లో సందిగ్ధం అనే మాట వచ్చింది. సందిగ్ధం కొనసాగే అవకాశం ఉందా?

Update: 2024-05-06 10:14 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై ఇప్పుడు ఎవరినోట విన్నా ఒకటే మాట. ఏపార్టీ గెలుస్తుందో అంత తేలిగ్గా చెప్పలేము. టైట్‌గా ఉంటుంది. రెండు పార్టీల్లోనూ అభ్యర్థులు గట్టి పోటీని ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు తీసుకున్న వారు సైలెంట్‌ ఓటింగ్‌ చేస్తారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న వారు ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సిందేనని పైకి మాట్లాడుతున్నారు. ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే పలు సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించాయి. కొన్ని సంస్థలు ఒక పార్టీకి అనుకూలంగా, మరికొన్ని సంస్థలు మరో పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని చెబుతున్నాయి. ఖచ్చితంగా విశ్వసించే కొన్ని సంస్థలు ఎడ్జ్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఎవరు ఏమి చెప్పినా ఖచ్చితంగా విశ్వసించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా మంది ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సొతంగా డబ్బులు ఇచ్చి వారికి తెలిసిన కొంత మంది జర్నలిస్టుల ద్వారా సర్వేలు చేయించుకున్నారు. ఈ సర్వేల్లో నెగటివ్‌ ఫలితాలు వచ్చినా అనుకూలంగా ఉన్నట్లు మీడియాకు లీకులు ఇచ్చి రాయించుకుని ప్రచారం చేసుకుంటున్నారు.
చరిత్రలో వన్‌సైడ్‌ జడ్జిమెంట్‌
ఒక్కసారి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే సందిగ్ధమైన తీర్పును ఓటర్లు ఇంతవరకు ఇవ్వలేదు. ఏపార్టీ అధికారం చేపట్టినా ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంపూర్ణ మెజారిటీ ఇస్తూ వచ్చారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి పరిశీలిస్తే వన్‌సైడ్‌ ఫలితాలే కనిపిస్తాయి. అంతకు ముందు కూడా ఏకపక్షంగానే ఓటర్ల తీర్పు ఉంది. 1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 201, కాంగ్రెస్‌ పార్టీకి 60, సిపిఎంకు 5, సీపీఐకి 4, బిజెపికి 3, జనతా పార్టీకి 1, ఐసిజెకు 1, స్వతంత్రులకు 19 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అప్పుడు 294 స్థానాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అప్పట్లో మేనకా గాంధీ ఆధ్వర్యంలోని సంజయ్‌ విచార్‌ మంచ్‌ పార్టీని కలుపుకుని పోటీ చేసింది. ఆ పార్టీ నుంచి నలుగురు తెలుగుదేశం పార్టీ గుర్తుపైనే పోటీ చేసి గెలిచారు.
1985లో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఎన్‌టీ రామారావు ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసింది. తిరిగి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 202 సీట్లు వచ్చాయి. అంటే మరో సీటు అదనంగా వచ్చి ఎన్టీఆర్‌ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం పార్టీలు కూటమిగా పోటీ చేశాయి. అయినా ఓడిపోక తప్పలేదు. కాంగ్రెస్‌ పార్టీకి 181, తెలుగుదేశం పార్టీకి 74, సిపిఐకి 8, సీపీఎంకు 6, బిజెపికి 5, జనతాకు 1, ఎంఐఎంకు 4, స్వతంత్ర అభ్యర్థులకు 15 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ వచ్చింది.
తిరిగి 1994లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ సీపీఐ, సీపీఎంలతో కలిసి పొత్తులో పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీకి 216 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు 26 సీట్లు మాత్రమే వచ్చాయి. సిపిఐ 19, సీపీఎం 15 సీట్లలో విజయం సాధించాయి. బిజెపి 3, ఎంబిటి 2, ఎంఐఎం 1, స్వతంత్రులు 12 చోట్ల నెగ్గారు.
1999లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 180 సీట్లలో తెలుగుదేశం పార్టీ గెలవగా, కాంగ్రెస్‌ పార్టీ 91 సీట్లలో విజయం సాధించింది. బిజెపి 12, ఎంఐఎం 4, సిపిఎం 2, స్వతంత్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు.
తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 185 సీట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 47 సీట్లు దక్కాయి. టిఆర్‌ఎస్‌కు 26, సీపిఎం 9, సిపిఐ 6, బిజెపి 2, జనతా 2, సమాజ్‌వాదీ పార్టీ 1, బహుజన సమాజ్‌వాదీ పార్టీ 1, ఎంఐఎం 4, స్వతంత్రులు 11 చోట్ల విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టిఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలు కూటమిగా పోటీ చేశాయి.
2009లో ఎన్నికలు జరగ్గా తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ వచ్చింది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌కు 156, తెలుగుదేశం పార్టీకి 92, ప్రజారాజ్యం పార్టీకి 18, టీఆర్‌ఎస్‌కు 10, ఎంఐఎంకు 7, సిపిఐ 4, బిజెపి 2, సీపీఎం 1, లోక్‌సత్తా 1, స్వతంత్రులు ఒక స్థానంలో విజయం సాధించారు.
(విభజిత ఆంధ్రప్రదేశ్‌లో పరిశీలిస్తే 175 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 106, తెలుగుదేశం పార్టీకి 53, ప్రజారాజ్యం పార్టీకి 16 స్థానాలు వచ్చాయి.)
రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి 102 సీట్లు రాగా వైఎస్సార్‌సీపీకి 67 సీట్లు వచ్చాయి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. బిజెపికి నాలుగు సీట్లు వచ్చాయి.
2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్సార్‌సీపీకి 151సీట్లు, తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు, జనసేన పార్టీకి ఒక సీటు వచ్చాయి.
1983 నుంచి 9సార్లు ఎన్నికలు జరిగితే ప్రతి ఎన్నికల్లోనూ ఓటర్లు ఒకే పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చారు. 2024లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే విధమైన తీర్పు ఇస్తారు తప్ప సందిగ్ధత ఉండే అవకాశం లేదని ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి చెప్పొచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత పట్టణాల్లో ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు బాగా ఉపయోగ పడ్డాయని, వారు సైలెంట్‌గా జగన్‌కు ఓటు వేసే అవకాశం ఉందనేది ఒక అంచనా. జగన్‌ ప్రభుత్వంలో మధ్య తరగతి వారికి పనులు లేకుండా పోయాయని, కాంట్రాక్టర్లకు వర్కులు అసలు లేవని, అభివృద్ధిని కోరుకునే ఇన్‌కంట్యాక్స్‌ కట్టే వారికి కావాల్సిన పారిశ్రామిక రంగం గురించి కానీ, నిరుద్యోగ సమస్యకు పరిష్కారాలు కానీ, ఇరిగేషన్‌ సెక్టార్‌ను కానీ పట్టించుకోలేదని, అందువల్ల జగన్‌ ప్రభుత్వం అధికారం కోల్పోయే అవకాశం ఉందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.


Tags:    

Similar News