తప్పులు చేసిన వారిని వదిలి పెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

తాను రాజకీయ కక్షసాధింపులకు పోను అని సీఎం చంద్రబాబు అన్నారు. తాను బాధ్యతగల ప్రజా ప్రతినిధిని అని అన్నారు.

By :  Admin
Update: 2024-11-01 11:14 GMT

తప్పులు చేసిన వారిని వదిలి పెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తానొక బాధ్యతగల ప్రజాప్రతినిధిని అని, రాజకీయ కక్షసాధింపులకు పోనని, తప్పులు చేసిన వారిని వదిలి పెట్టనని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో సోమవారం దీపం 2.0 కింద ఉచిత గ్యాస్‌ సిలీండర్‌ పథకాన్ని ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అసెంబ్లీ నియోజక వర్గం ఈదుపురంలో ఒంటరి మహిళ జానకి ఇంటికెళ్లి పెన్షన్‌ను అందజేశారు. అనంతరం ఆమె కుటుంబం బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇల్లు లేదని తెలుసుకున్న తర్వాత వెంటనే ఆమెకు ఇల్లు కట్టి ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే ఊరిలో ఉచిత గ్యాస్‌ పథకం కింద శాంతమ్మ ఇంటికెళ్లి ఉచిత గ్యాస్‌ సిలీండర్‌ను అందజేశారు. అనంతరం అదే సిలీండర్‌ను స్టౌవ్‌కు కనెక్షన్‌ ఇచ్చిన తర్వాత సీఎం చంద్రబాబే స్వయంగా గ్యాస్‌ స్టౌవ్‌ను వెలిగించి టీ పెట్టి శాంతమ్మకి ఇచ్చారు.

అనంతరం జరిగిన ప్రజా వేదికలో కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వం, జగన్‌ పాలనపై మరో సారి ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం అంటే వచ్చిన జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండి పడ్డారు. గత పాలకులు మాదిరిగా తన మీటింగ్‌లలో ఆర్భాటాలు, ఆరంబడాలు ఉండవన్నారు. బలవంతంగా సమావేశాలకు తీసుకొని రావడం ఉండదన్నారు. పరదాలు కట్టడం అంతకన్నా ఉండదన్నారు. చెట్లను నరకడం కానీ ఉండదన్నారు. ఇంకా చెట్లను నాటే పని చేస్తామన్నారు. ప్రజల గుండెల్లో స్థానం ఉండాలని, అది చాలని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ప్రజాస్వామ్య హద్దులు దాటి ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. అన్నింటిని ఎదరించి మొన్నటి ఎన్నికల్లో జనసైనికులు, తెలుగు తమ్ముళ్లు రాజీలేని పోరాటం చేశారని అభినందించారు. ఒక పక్క రాజకీయ కక్షసాధింపు చర్యలకు పోనని చెబుతూనే మరో పక్క తప్పులు చేసిన గత పాలకులను వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.
నాయకుడంటే ప్రజల మనస్సుల్లో అభిమానం సంపాదించాలన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని, తాను అలాంటి వ్యక్తినని అన్నారు. కట్టెల పోయ్యితో మహిళలు పడిన బాధలు తనకు తెలుసన్నారు. అలాంటి మహిళల కష్టాలను దీపం పథకం ద్వారా సిలీండర్లు ఇచ్చి తీర్చానన్నారు. డ్వాక్రా సంఘాలకు మళ్లీ పూర్వ వైభవం తెస్తానన్నారు. అంతేకాకుండా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తామన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు వాటిని పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే అశోక్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Tags:    

Similar News