విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవం

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ ఎన్నికను బహిష్కరించింది.;

Update: 2025-04-28 09:05 GMT

అత్యంత ఉత్కంఠగా మారిన గ్రేటర్‌ విశాఖపట్నం మేయర్‌ ఎన్నిక చివరకు ఏకగ్రీవంకు దారి తీసింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ ఎన్నికకు పోటీ చేయకుండా బహిష్కరించడంతో ఏకగ్రీవం అనేది అనివార్యంగా మారింది. కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ మేయర్‌గా ఎన్నికయ్యారు. కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణయాదవ్‌ విశాఖ మేయర్‌ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును ప్రతిపాదించగా, కూటమి మరో భాగస్వామి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆయన పేరును బలపరిచారు. ఈ క్రమంలో జీవీఎంసీ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

జీవీఎంసీ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ మయూరి అశోక్‌ ప్రకటించారు. ఆ మేరకు పీలా శ్రీనివాసరావు విశాఖ నగర మేయర్‌గా ఎన్నికైనట్లు ధృవపత్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ మయూరి అశోక్, పీలా శ్రీనివాసరావుకు అందజేశారు. అనంతరం పీలా నాగేశ్వరరావుతో విశాఖ నగర మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో విశాఖపట్నం కూటమి వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

గత ఎన్నికల్లో గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ పాగా వేసింది. అత్యధిక కార్పొరేటర్లను గెలుచుకున్న వైఎస్‌ఆర్‌సీపీ మేయర్‌ పదవిని కైవనం చేసుకుంది. అయితే 2024 ఎన్నికల తర్వాత రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. కూటమి అధికారంలోకి రావడంతో ఎలాగైనా జీవీఎంసీలో పాగా వేయాలని కూటమి వర్గాలు నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగా వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేట్లను విదేశాల టూర్లకు పంపించి కూటమి వర్గాలు తమ వైపునకు తిప్పుకున్నాయి.
ఈ నేపథ్యంలో అప్పటి వరకు మేయర్‌గా ఉన్న గొలగాని హరి వెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గింది. ఈ నేపథ్యంలో మేయర్‌ ఎన్నిక అనేది అనివార్యంగా మారింది. గత మునిసిపల్‌ ఎన్నికల్లో పీలా శ్రీనివాసరావునే మేయర్‌ అభ్యర్థిగా నాడు టీడీపీ ప్రకటించింది. అయితే వైసీపీ కైవసం చేసుకోవడంతో పీలాకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అదే పీలా శ్రీనివాసరావుకు మళ్లీ అవకాశం కల్పించింది.
Tags:    

Similar News