ఆ శిరోముండనం కేసు గుర్తుందా.. పవన్ కల్యాణ్ ను ఆశ్రయించిన ఆషా!
తన భర్త రెండో పెళ్లిని అడ్డుకున్న భార్యకు శిరోముండనం చేశాడో ప్రబుద్ధుడు.. తనకు న్యాయం చేయమని ఆ బాధితురాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కోరుతోంది..;
By : The Federal
Update: 2025-07-17 03:55 GMT
వాళ్లిద్దరిది కులాంతర వివాహం.. ప్రేమపెళ్లి.. ఆ తర్వాత ఏమి జరిగిందో గాని కట్టుకున్న వాడే కర్కశంగా వ్యవహరించారు. భార్యకు శిరోముండనం చేసి వీధుల్లో ఊరేగించాడు. ఇప్పుడామె న్యాయం కోసం పోరాడుతోంది. ఈ క్రమంలో ఆమె జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశ్రయించింది. తన మొర ఆలకించాలంటోంది. గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని జనసేన కార్యాలయానికి వచ్చిన ఆమె తన గోడు వెళ్లబోసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి..
ఆమె పేరు షేక్ ఆషా. వయసు 27. నెల్లూరు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడికి చెందిన కర్రి రాంబాబు (మారుపేరు అభిరామ్) ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నప్పుడు వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఓ కుమారుడు పుట్టాడు. ఆమె పెళ్లిళ్లు, పేరంటాలు, పుట్టిన రోజు వేడుకలకు ఈవెంట్లు చేసేది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. భర్త ముఖం చాటేశాడు. బిడ్డను తీసుకుని పెదకొండేపూడి వచ్చింది. అత్తమామలు తమకేమీ తెలియదన్నారు. ఇంట్లోకి రావొద్దాన్నారు. ఆషా ఇంట్లోకి వెళ్తానంటూ పట్టుబట్టింది. వారు బయటకు గెంటేశారు.
ఆషా- పోలీస్‌స్టేషన్లో కేసు పెట్టింది. ఆమె భర్త రాంబాబు పలుకుబడి ఉన్న స్థానిక రాజకీయ నాయకుల్ని ఆశ్రయించారు. కేసు వెనక్కితీసుకోమని వాళ్లు ఆమెపై వత్తిడి చేశారు. ఆమె ససేమిరా అంది. వాళ్లు బెదిరించారు. ఆమె వెనక్కి తగ్గలేదు. రాజకీయ నాయకులు ఆషా కుటుంబ సభ్యుల్ని హెచ్చరించారు. ఆమెకు అండగా నిలిచిన వారినీ వదల్లేదు.
సరిగ్గా ఈ దశలో రాంబాబు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆషా అడ్డుకుంది. 2024 ఫిబ్రవరిలో రాంబాబు రెండో పెళ్లి చేసుకోబోతుండగా ఆమె గోల చేసింది. దీంతో రాంబాబు ఆమెను ఇంట్లో బంధించాడు. శిరోముండనం చేశాడు. ఆ జుత్తును ఒక చేత్తో పట్టుకుని ఆమెను మరో చేత్తో బయటకు ఈడ్చుకు వచ్చి వీధంతా తిప్పాడు. ఆమె దీనిపైనా కేసు పెట్టింది. పోలీసులు ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు.
ఇది జరిగి ఏడాదిన్నర కావొస్తున్నా కేసు అడుగు ముందుకు కదల్లేదు. ఆమెకు న్యాయం జరగలేదు. ఈ విషయాన్ని రాష్ట్ర డెప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చి న్యాయం చేయమని కోరడానికి ఆమె మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరింది. అయితే అక్కడ పవన్ కల్యాణ్ లేకపోవడంతో తన గోడును అక్కడున్న పార్టీ నేతలకు వెళ్లబోసుకుంది.
ఆషా జీవనం ఆగమాగం..
ఇన్ని గొడవల మధ్య ఆషా జీవితం ఆగమాగమైంది. జీవనం అస్తవ్యస్తమైంది. ఉపాధి కరవైంది. చేతిలో చిల్లిగవ్వ లేక కొడుకును పోషించుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నానని వాపోయింది. నాకు జరిగిన అన్యాయంపై కూటమి ప్రభుత్వం విచారణ చేయించాలి’ అని ఆమె కోరుతోంది. ఆమె గోడు విన్న జనసేన నేతలు సమీపంలోని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీతానగరం పోలీసులు విచారిస్తామన్నారు.