ప్రభుత్వ ఆఫీసుల్లో బాబుతో పాటు పవన్‌ ఫొటో

ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ ఫొటో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపిస్తుంది.

Update: 2024-06-15 12:24 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొదటి సారిగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ ఫొటో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నా ఫొటోతో పాటు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటో పక్కనే, పవన్‌ కల్యాణ్‌ ఫొటో కూడా పెట్టాల్సి ఉంటుంది. వెంటనే దీనికి సంబంధించిన ఫొటోను రెడీ చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పంపించాలని ఐ అండ్‌ పీఆర్‌ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఫొటో మాత్రమే..
ఇప్పటి వరకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఫొటో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో పెడుతూ వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రుల ఫొటోలు పెట్ట లేదు. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అయినా వారి చిత్ర పటాలు ప్రభుత్వ ఆఫీసుల్లో కనిపించ లేదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించింది. అయినా ముఖ్యమంత్రిగా జగన్‌ ఫొటో తప్ప ఉప ముఖ్య మంత్రుల ఫొటోలు పెట్ట లేదు.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం కావడం వల్ల, పవన్‌ కల్యాణ్‌ అభిమానులు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం వల్ల టీడీపీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీలతో ఎమ్మెల్యేలు గెలుపొందారు. అందు వల్ల పవన్‌ కల్యాణ్‌ చిత్ర పటాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెడితే బాగుంటుదని చంద్రబాబు భావించినట్లున్నారు.
ఎన్నికల ప్రచారంలో పవన్‌ ముఖ్యమంత్రి అవుతాడంటూ ఆయన అభిమానులు చాలా సభల్లో నినాదాలు కూడా చేశారు. అయితే పవన్‌ కల్యాణ్‌ వారి అభిమానాన్ని స్వాగతిస్తూనే ప్రస్తుతం తనకు అలాంటి ఆశలు ఏమీ లేవని చెబుతూ అభిమానులను శాంతింప చేస్తూ వచ్చారు. జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన 21 అసెంబ్లీ నియోజక వర్గాలు, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అంటే నూటికి నూరు శాతం పవన్‌ కల్యాణ్‌ టీమ్‌ ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. భవిష్యత్‌లో జనసేన కార్యకర్తల నుంచి కానీ, పవన్‌ కల్యాణ్‌ అభిమానుల నుంచి కానీ ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు ముందస్తు వ్యూహంలో భాగంగానే చంద్రబాబు నాయుడు తనతో సమానమైన గౌవరం పవన్‌ కల్యాణ్‌కు ఎప్పుడూ ఉంటుందని చెప్పడం కోసం ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం.
అమితానందంలో పవన్‌ కల్యాణ్‌
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడు లేని విధంగా అధికార పక్ష కూటమి నాయకుడికి దక్కని గౌరవం, హోదా తనకు దక్కాయనే ఆనందంలో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. మనసులో మాటను బయట పెట్టక పోయినా.. పవన్‌ అభిమానుల్లోను, జనసేన శ్రేణుల్లోను అవధుల్లేని ఆనందం ఉందనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాట.
Tags:    

Similar News