పంచాయతీల్లో మార్కు కోసం పవన్‌ ప్రయత్నం

గ్రామీణ ప్రజలకు పంచాయతీల ద్వారా నిరంతరం సేవలు అందేలా చూడాలని, దీనికోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు జారీ చేశారు.;

By :  Admin
Update: 2025-01-20 11:32 GMT


ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో తనకంటూ ప్రత్యేక మార్కు పాలన ఉండాలనే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. దీని కోసం అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్‌ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని మాత్రమే చేపట్టిన క్లస్టర్‌ గ్రేడ్ల విభజన విధానానికి, నూతనంగా జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకొని పంచాయతీలను క్లస్టర్‌ గ్రేడ్లుగా విభజించాలని సూచించారు. సిబ్బంది నియామకం విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోమవారం తన క్యాంపు కార్యలయంలో పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, కమిషనర్‌ కృష్ణ తేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభాగా ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో పాత క్లస్టర్‌ వ్యవస్థ వల్ల సిబ్బంది నియామకం విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయి. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని కొత్త క్లస్టర్‌ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవడం ద్వారా ఆ సమస్యలను అధికమించడంపై చర్చించారు. ఈ విధంగా చేయడం వల్ల మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలు అమలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతో పాటు గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత అయిన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదలలో తగినంత మంది సిబ్బంది ఉండే విధంగా చూడటంలో సమస్యలు తలెత్తవని సూచించారు.
అయితే దీనిపైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తొలుత ఈ అంశంపై అధ్యాయనం చేసి పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేందుకు అవసరమైన సిఫార్సులు చేయాలని సూచించారు. దీని కోసం ప్రత్యేక కమిటీ వేయాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. జిల్లా యూనిట్‌ ప్రాతిపదికన 26 జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకొని జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలను రాష్ట్ర కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్‌ గ్రేడ్లపై రూపొందించే నివేదికను ఈ కమిటీ ప్రభుత్వానికి సమర్పించనుంది.
Tags:    

Similar News