పవన్ కల్యాణ్ మాటల్లో మిన్న... చేతల్లో సున్నా...
పవన్ కల్యాణ్ ‘స్పాట్ యాక్షన్స్’ మాత్రమే చేస్తున్నారు. ఆ తరువాత వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఎందుకని?;
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల చేపట్టిన కొన్ని చర్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా విశాఖపట్నం రుషికొండ భవనాల పరిశీలన, కాకినాడ పోర్టులో షిప్ సీజ్ ఘటనలు రాష్ట్రంలోని ప్రజల దృష్టిని ఆకర్షించాయి. గత ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయం తర్వాత పవన్ కల్యాణ్ ఇలాంటి 'స్పాట్ యాక్షన్‌లు' ఎందుకు చేపడుతున్నారు? ఇవి కేవలం రాజకీయ ఆటుపోట్లా లేక ప్రజా సమస్యల పరిష్కారానికి దారా?
రాజకీయ వేడెక్కిస్తున్న రుషికొండ భవనాలు
రుషికొండ భవనాలు గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో నిర్మాణమైనవి. రూ.453 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాలు మొదట్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి కోసం 'ప్యాలెస్'గా నిర్మించారని ఆరోపణలు వచ్చాయి. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి కొండలు తవ్వి, చెట్లు నరికి నిర్మాణాలు చేపట్టారని విపక్షాలు అప్పట్లో ఆందోళనలు వ్యక్తం చేశాయి. పవన్ కల్యాణ్ 2023లో రుషికొండను సందర్శించి, ఉత్తరాంధ్ర ప్రాంత వినాశనం జరుగుతోందని ఖండించారు. అప్పటి నుంచి ఈ అంశం రాజకీయంగా వేడెక్కుతూనే ఉంది.
రుషికొండపై పవన్ ప్రతిపాదనలు ఏమిటంటే...
ఆగస్టు 29, 2025న పవన్ కల్యాణ్ మరోసారి రుషికొండను సందర్శించారు. ఈ పరిశీలనలో భవనాల్లో చెదలు (టెర్మైట్స్) పట్టినట్లు, పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నట్లు, నీటి లీకేజీలు ఉన్నట్లు గుర్తించారు. ఇంజినీర్లతో సేఫ్టీ ఆడిట్ చేయాలని సూచించారు. మునుపటి ప్రభుత్వం వ్యర్థంగా ఖర్చు చేసిందని విమర్శించారు. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ భవనాలను టూరిజం ప్రమోషన్ కోసం ఉపయోగించాలని భావిస్తోంది. జనసేన పార్టీ రుషికొండ భవనాలను మైస్ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) సదుపాయంగా మార్చాలని తీర్మానం చేయనుంది. ఇది విశాఖను టూరిజం హబ్‌గా మార్చే దిశగా ఒక అడుగు అని చెప్పొచ్చు.
గతంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ భవనాలను పరిశీలించారు. కానీ తర్వాత మాట్లాడలేదు. దీనికి కారణం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాధాన్యతలు మారాయి. అభివృద్ధి పథకాలు, ఆర్థిక సమస్యలు ముందుండటంతో రుషికొండ వివాదం వెనక్కి వెళ్లింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ మరోసారి సందర్శించడం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయి. జనసేన పార్టీ ఉత్తరాంధ్రలో బలపడాలని భావిస్తోంది. మునుపటి ప్రభుత్వం పర్యావరణ వినాశనాన్ని గుర్తుచేసి, ప్రజల్లో చర్చ రావడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఉద్దేశ్యం కావచ్చు.
ప్రభుత్వ వాదన
ఈ భవనాలను వ్యర్థం చేయకుండా టూరిజం, కాన్ఫరెన్స్ సెంటర్‌గా మార్చి ఉపయోగించుకుంటామని చెబుతోంది. మరమ్మతులు చేసి, సేఫ్టీ చెక్ చేస్తామని పవన్ చెప్పారు. అంటే పూర్తిగా పనికిరావని కాదు, కానీ మునుపటి నిర్వహణలో లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
కాకినాడ షిప్ సీజ్ డ్రామా తర్వాత నిశ్శబ్దం
2024 నవంబర్ చివర్లో పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి, ప్రభుత్వ చౌక బియ్యం (పీడీఎస్ రైస్) అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. 'స్టెల్లా ఎల్' అనే షిప్‌లో 38,000 మెట్రిక్ టన్నుల రైస్ ఉందని, అందులో 1,320 టన్నులు పీడీఎస్ రైస్ అని తనిఖీల్లో తేలింది. పవన్ 'సీజ్ ద షిప్' అని ఆదేశించారు. సముద్రంలో పర్యటించి, రైస్ తనిఖీ చేయాలని సూచించారు. ఇది భారీ చర్చకు దారితీసింది.
కానీ తర్వాత ఏమైంది? షిప్‌ను సీజ్ చేయడం సాధ్యం కాలేదు. లీగల్, ప్రొసీజరల్ సమస్యలు ఎదురయ్యాయి. ఎగుమతి దారులు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి, ఫైన్ కట్టి షిప్‌ను విడుదల చేశారు. 2025 జనవరి 7న షిప్ కాకినాడ పోర్టు నుంచి బయలుదేరింది. దీని వల్ల ఎగుమతి దారులకు రూ.7.11 కోట్ల నష్టం వచ్చిందని వైఎస్‌ఆర్‌సీపీ విమర్శించింది. పవన్ 'ఓవరాక్షన్' అని ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఈ అంశం ప్రస్తావన లేకుండా పోయింది. ఎందుకంటే సమస్య పరిష్కారమైంది. ఇతర ప్రాధాన్యతలు ముందుకొచ్చాయి.
పవన్ కల్యాణ్ 'మెరుపులు' రాజకీయ వ్యూహమా?
పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు ఇలాంటి 'ఫ్లాష్ యాక్షన్‌లు' చేపట్టడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని స్పష్టమవుతోంది. ఆయన ఎప్పుడూ 'యాక్షన్ ఓరిఎంటెడ్' ఇమేజ్‌ను కాపాడుకుంటారు. వన్యప్రాణి సంరక్షణ, అక్రమ రవాణా, పర్యావరణ సమస్యలు, ఇవి ప్రజలకు దగ్గరగా ఉండే అంశాలు. ఎన్‌డీఏ కూటమిలో టీడీపీ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, జనసేన ఇలాంటి చర్యలతో తన ఉనికిని చాటుకుంటుంది. దీని వెనుక పెద్ద విషేషం ఏమీ లేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించడం విశేషం. కానీ రాజకీయంగా లబ్ధి పొందడం, ప్రజల్లో చర్చ రావడం జనసేన ప్రధాన ఉద్దేశ్యం అనేది పరిశీలకులు చెబుతున్న మాట. విపక్షాలు ఇది 'డ్రామా' అని విమర్శిస్తున్నాయి. కానీ పవన్ అనుచరులు 'ప్రజా సేవ' అని చెబుతున్నారు.
మొత్తంగా ఈ చర్యలు ప్రభుత్వానికి సానుకూల ఇమేజ్‌ను తెచ్చిపెడుతున్నాయి. కానీ ఫాలో అప్ లేకుండా పోతే విమర్శలు తప్పవు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇలాంటి చర్యలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు.