కాపు, కమ్మ కులాల మధ్య సయోథ్యకేనా లక్ష్మీనాయుడి ఫ్యామిలీకి పరిహారం?
లక్ష్మీ నాయుడి హత్య జరిగిన 20 రోజుల తర్వాత పరిహారం ఏమిటీ?
By : The Federal
Update: 2025-10-21 14:24 GMT
నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామం ఘటనలో చనిపోయిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. లక్ష్మీనాయుడు హత్యను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. శాంతిభద్రతలపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రులు అనిత, నారాయణ, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. లక్ష్మీనాయుడు హత్య ఘటన అమానవీయం, అమానుషమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసు విచారణ వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం తరఫున పరిహారం ప్రకటించారు. మృతుని భార్యకు రెండెకరాల భూమితో పాటు రూ.5 లక్షల నగదు, ఇద్దరు పిల్లలకు రెండెకరాల చొప్పున భూమితో పాటు రూ.5లక్షల నగదు ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని ఆదేశించారు. లక్ష్మీనాయుడి పిల్లల్ని చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కారు దాడిలో గాయపడిన పవన్‌కు 4 ఎకరాలు, రూ.5లక్షల నగదు, భార్గవ్‌కు రూ.3లక్షల పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు. లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం అందించాలని సీఎం చెప్పారు. పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని సీఎం తెలిపారు.
రాజకీయ దుమారం...
నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడులో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్యకు గురికావడం రాజకీయ దుమారం రేపింది. అక్టోబర్ 2వ తేదీన బైక్‌పై వెళ్తున్న లక్ష్మీనాయుడును హరిశ్చంద్రప్రసాద్ అనే వ్యక్తి కారుతో ఢీ కొట్టి చంపారు. ఈ హత్య కేసు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ తరలించారు. అయితే లక్ష్మీనాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని... నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ టీడీపీ కార్యకర్త, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఈ కేసును టీడీపీ నేతల ఒత్తిడితో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
ఈ హత్యకు కులం రంగు ఆపాదించడం సరైనది కాదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ హత్యకు వ్యక్తిగత శత్రుత్వం, ఆర్థిక వివాదాలు కారణమని చెప్పారు. కులాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసేలా పోస్ట్‌లను తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వెల్లడించారు.
ఈ హత్యపై రాజకీయ దుమారం చెలరేగడంతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగడంతో సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించారు.
ఈ ఘటనపై హోమంత్రి అనితను నివేదిక కోరారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు మంత్రులు అనిత, నారాయణ నెల్లూరు జిల్లా రాళ్లపాడు వెళ్లారు. ఈ హత్యకు కారణాలు, విచారణలో పురోగతి, బాధిత కుటుంబానికి సాయంపై సమగ్ర నివేదిక మంత్రులు, నేతలు సీఎం చంద్రబాబుకు ఇవ్వనున్నారు.
ఈ సందర్బంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ... లక్ష్మీనాయుడు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి శిక్షపడేలా చేస్తామని తెలిపారు. లక్ష్మీ నాయుడు సతీమణి సుజాతను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్‌లో పరామర్శించారని చెప్పారు. లక్ష్మీనాయుడు హత్యకు రాజకీయ కోణంలో చూడకూడదని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
ఈ హత్య కేసులో పోలీసు దర్యాప్తును తప్పుపట్టే విధంగా, పోలీసు శాఖను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత హెచ్చరించారు. వాస్తవాలను దాచిపెట్టి, అబద్ధాలను వ్యాప్తి చేసే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సంఘటన వ్యక్తిగత, ఆర్థిక వివాదాల కారణంగా జరిగిందని... దీనిని కులంతో ముడిపెట్టడం, వర్గాలను రెచ్చగొట్టడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అలాంటి చర్యలకు పాల్పడేవారు క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
ఈ హత్య జరిగిన 20 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని కూడా కొందరు తప్పుబడుతున్నారు. హత్య అని తెలిసిన తర్వాత వెంటనే పరిహారం ఇస్తే అది స్పాంటేనిటీ అవుతుందే గాని కమ్మ, కాపు కులాల మధ్య సయోథ్య కోసం అన్నట్టుగా ఇప్పుడు పరిహారం ఇచ్చారని కాపునాడు కు చెందిన శివశంకర్ రాయల్ అభిప్రాయపడ్డారు.