పవన్ కల్యాణ్ కుంభమేళా మార్ఫింగ్ ఫొటో పోస్టుల రచ్చ
పవన్ కల్యాణ్ కుంభమేళా ఫొటోను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని జనసేన శ్రేణులు ఫిర్యాదులు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.;
By : Admin
Update: 2025-02-21 12:33 GMT
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుంభమేళా ఫొటో మార్ఫింగ్ తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ రచ్చగా మారింది. దీనిపై అటు కూటమి శ్రేణులు, ఇటు జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు చోట్ల జనసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వ్యూహం సినిమా ప్రొమోషన్ సమయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్‌ల మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఆయన పోలీసు విచారణ ఎదుర్కొంటున్నారు. అలాగే కొంత మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన వందలాది మంది కార్యకర్తలు ఇలాంటి కేసులే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుంభమేళా ఫొటో మార్పింగ్ రచ్చ తెరపైకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మీద కుంభమేళా ఫొటోను మార్పింగ్ చేసి హర్షవర్థన్ రెడ్డి అనే ఎక్స్ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు. కుంభమేళాలో పవన్ కల్యాణ్ పవిత్ర స్నానం చేస్తున్న ఫొటోకు మరో సినీ నటుడు సంపూర్ణేష్ బాబుతో పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇలా మార్ఫింగ్ చేసిన ఫొటోను పెట్టడంపై జనసేన పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అనుచిత పోస్టుల పట్ల జనసేన నేత రిషికేష్ నెల్లూరు జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావలి రెండో పట్టణం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఇదే సంఘటనపై పల్నాడు జిల్లాలో జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. ఫొటోల మార్ఫింగ్‌లపై నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగనన్న సైన్యం పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాలో పవన్ కల్యాణ్ మార్ఫింగ్ ఫొటోలను పోస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో మరో సారి సోషల్ మీడియా కేసుల పర్వం మొదలు కానుంది.
ఫిబ్రవరి 18న మహాకుంభమేళాలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రవిత్ర స్నానాలు ఆచరించారు. తన భార్య అనా కొణిదెల, కుమారుడు అకీరానందన్, సినీ దర్శకుడు త్రివిక్రమ్, టీటీడీ బోర్టు సభ్యుడు నందసాయిలతో కలిసి పవన్ కల్యాణ్ త్రివేణి సంగమానికి హారతులిచ్చారు. భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధర్మం విషయంలో మాత్రం ఏకమవుతారు. సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్‌లోను పరిడవిల్లాలి. సనాతన ధర్మాన్ని నమ్మి, పాటించే వారిపై కొందరు నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం బాధ్యతారాహిత్యమే.. సనాతన ధర్మం నమ్మే వారి మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడటం మంచిది కాదు అంటూ ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. అయితే పవన్ కల్యాణ్ తన మార్ఫింగ్ ఫొటోలపై ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.