స్పూర్తి సందేశాన్నిచ్చిన పవన్ కల్యాణ్ ఎక్స్ వైఫ్ రేణూ దేశాయ్
రాజకీయాలకు దూరంగా ఉంటాను..సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమమని వచ్చాను.;
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ విజయవాడలో జరిగిన సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు. భారత చైతన్య యువజన పార్టీ(బీసీవై) ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం విజయవాడ లెమన్ ట్రీ హోటల్‌లో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సావిత్రిబాయి సేవలను ఆమె కొనియాడారు. సావిత్రిబాయి ఫూలే జన్మించిన ప్రాంతంలో తాను జన్మించడం పూర్వ జన్మ సుకృతమని, అదే ప్రాంతంలో తాను పుట్టడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. చిన్న తనం నుంచి సావిత్రిబాయి కథలు వింటూ.. సావిత్రిబాయి కథలు చదువుతూ పెరిగానన్నారు. అంత గొప్ప సంఘ సేవకురాలు సాయిత్రిబాయి ఫూలే గురించి నిర్వహిస్తున్న సభలో తాను పాల్గొనడం, ప్రసంగించడం చాలా ఆనందంగా ఉందన్నారు. సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో మిగిలి పోతాయని, ఎన్నేళ్లయినా చెరిగి పోవన్నారు. ఆడపిల్లల చదువుల కోసం ఆ నాడు సావిత్రిబాయి ఫూలే పోరాడకపోతే, అడుగు ముందుకు వేయకపోతే మహిళలు ఎక్కడ ఉండేవాళ్లమో అని అన్నారు.