మొక్కులు తీర్చుకుంటున్న పవన్..

ఎన్నికల ముందు మొక్కుకున్న మొక్కులను జనసేనాని, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఈరోజు తీర్చుకుంటున్నారు.

Update: 2024-06-10 11:06 GMT

ఎన్నికల ముందు మొక్కుకున్న మొక్కులను జనసేనాని, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఈరోజు తీర్చుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో తాను గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లిలో నిర్వహించిన సభలో చెప్పారు పవన్. ఇప్పుడు ఆ మొక్కును ఆయన తీర్చుకున్నారు. ఢిల్లీ నుంచి ఈరోజు విశాఖకు చేరుకున్న పవన్.. అనకాపల్లిలో పర్యటించారు. నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన పవన్‌కు అధికారులు స్వాగతం పలికారు.

ఆ తర్వాత ప్రమాణ స్వీకారం

అనకాపల్లిలో నిర్వహించిన సభలో తన మొక్కు గురించి చెప్పిన పవర్ మరో వ్యాఖ్య కూడా చేశారు. నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే తాను పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తానని వెల్లడించారు. అదే విధంగా ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన అమ్మవారిని దర్శించుకున్ని అన్ని మక్కులు తీర్చుకున్నారు. పూజలు పూర్తయిన వెంటనే ఆయన పిఠాపురంకు బయలుదేరారు. పిఠాపురంలో పవన్ పలు సమావేశాల్లో పాల్గొననున్నారని, పార్టీ శ్రేణులకు పలు అంశాల్లో దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అంతేకాకుండా మంత్రివర్గంలో స్థానంపై కూడా ఆయన పార్టీ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

పవన్‌కు రెండు శాఖలా!

ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌కు మంత్రివర్గంలో స్థానం పక్కా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే హోంశాఖ, డిప్యూటీ సీఎం పదవులతో పాటు మరో మంత్రిత్వశాఖను కూడా కట్టబెట్టే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్.. స్వతహాగా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి గనుక ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖను కూడా కేటాయిస్తే ఆంధ్రలో చలనచిత్ర పరిశ్రమ బాగా అభివృద్ధి అవుతుందని జనసేన నుంచి గట్టిగా వాదన వినిపస్తుందని, ఆ దిశగా టీడీపీ కూడా యోచిస్తోందని అందుతున్న సమాచారం. మరోవైపు తనకు ఎటువంటి మంత్రి పదవులు వద్దని, పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపైనే తాను దృష్టి పెట్టనున్నానని పవన్ చెప్తున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News