అనంతగిరి అడవుల్లో పవన్ కల్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడవుల్లో కాలినడకన పర్యటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడవుల్లో తిరుగుతూ గిరిజనులను పలకరించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర గిరిజనులతో కలివిడిగా తిరిగారు. ఏజెన్సీ ఏరియాలో కాలినడకన గూడేలకు వెళుతూ తిరగటంతో గిరిజనులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో కొండ ప్రాంతాల నుంచి రహదారులు లేక డోలీల్లో ఆస్పత్రులకు రోగులను, బాలింతలను తీసుకొచ్చే పరిస్థితికి పుల్ స్టాఫ్ పెట్టనున్నట్లు గిరిజనుల వద్ద ప్రకటించారు. ఆయన వెంట జిల్లా అధికారులు, కలెక్టర్ ఉన్నారు. రెండు రోజులుగా అడవుల్లో పర్యటిస్తూ గిరిజనుల బాగోగులు తెలుసుకుంటున్నారు. అటవీ శాఖ మంత్రి కూడా కావడంతో అడవుల పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో మంజూరు అయిన రోడ్లను తప్పనిసరిగా బాగుపడేలా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన గిరిజనులకు చెప్పారు.
శనివారం ఆయన అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో పర్యటించారు. అనంతగిరి దాదాపు మండలం అంతా అటవీ ప్రాంతంలోనే ఉంటుంది. 90 శాతం మంది గిరిజనులు ఈ జిల్లాలో ఉన్నారు. ఈ ప్రాంతం నిజానికి పర్యాటకానికి ఎంతో అనువైన ప్రాంతం. అరకు వెళ్లేటప్పుడు అనంతగిరి మీదుగానే పర్యాటకులు వెళుతుంటారు. కొండ పైభాగాన ఉండే అనంతగిరిలో గిరిజనులు వారి సాంప్రదాయ ప్రదర్శనలు, ఇతర వాయిద్యాలు, కళలు ప్రదర్శించడంలో దిట్ట. పవన్ కల్యాణ్ వెళ్లగానే వారు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. కళాకారిణిలతో పవన్ కల్యాణ్ చాలా సేపు ఆప్యాయంగా మాట్లాడారు. వారితో నాలుగు అడుగులు నృత్యం చేశారు. వారిని చూసినంత సేపు ఎంతో సంతోషంగా పవన్ కల్యాణ్ గడిపారు. డప్పు వాయిద్యాలు విని వారికి నమస్కరించారు. ఇంకా ఎటువంటి కళలు ప్రదర్శిస్తారని వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన సాయం అందుతుందో లేదో తెలుసుకున్నారు. ఎవరైనా సమస్యలు చెబితే విన్నారు. అధికారులకు అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేశారు.
ఏజెన్సీ ఏరియాలో రూ. 105.33 కోట్లతో రహదారుల నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. అనంతగిరి మండలం గుమ్మంతి, బల్లగురువు గ్రామాల్లో బీటీ రోడ్లకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. 24 గ్రామ పంచాయతీలను రోడ్ల ద్వారా అనుసంధానం చేసేందుకు అడగగానే ముఖ్యమంత్రి రూ. 49 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కొత్తగా నిర్మించబోయే గుమ్మంతి, బల్లగురువు మధ్య రోడ్డుపై మూడు కిలో మీటర్లు నడుచుకుంటూ కొండపైకి ఎక్కారు. అక్కడి గిరిజనులతో మాట్లాడారు. ఇంత వరకు మా కోసం ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి హోదాలో ఎవ్వరూ రాలేదని, పవన్ కల్యాణ్ మాకోసం వచ్చారని, ఆయనను ఎప్పటికీ మరిచిపోమని గిరిజనులు చెప్పారు. గిరిజన గూడేలు అక్కడక్కడ గుడిసెలు వేసుకుని పల్చగా కనిపిస్తాయని, అందువల్ల నాయకులు ఎవ్వరూ వీరి గురించి పట్టిచుంకోవడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. నేను ఓట్లకోసం వీరి వద్దకు రాలేదని, గిరిజనులను జన జీవనంలో కలిపేందుకు ఏమి చేయాలో ఆలోచించేందుకు మాత్రమే వచ్చినట్లు చెప్పారు.
పవన్ కల్యాణ్ అనంతగిరి కొండల్లో తిరుగుతుండటంతో అధికారులకు కూడా తప్పింది కాదు. కొండపైకి మూడు కిలో మీటర్లు ఎక్కడం అంటే చాలా మంది అధికారులకు ఆయాసం వచ్చింది. కొందరు మధ్య మధ్యలోనే ఆగిపోయారు. వైద్య సేవలు అందుతున్న తీరుపై గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. అనంతగిరికి సమీపంలోనే బొర్రా గుహలు కూడా ఉన్నాయి. పర్యాటకుల కోసం ఈ గుహలను బాగు చేయాలని అక్కడి గిరిజనులు కోరుతున్నారు. అరకు వెళ్లే వారు, వచ్చే వారు బొర్రా గుహలను సందర్శిస్తే స్థానికంగా గిరిజనులకు కూడా ఏదో ఒక వ్యాపారం పెట్టుకునేందుకు అవకాశం ఏర్పడుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అనంతగిరి చుట్టు పక్కల ప్రాంత మంతా కొండ ప్రాంతమే కావడం, రోడ్డుపై యాత్రికులు ప్రయాణించే సమయంలో వారు అటవీ అందాలను చూసి ఆనందించేందుకు ఏదైనా వ్యూ పాయింట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.