పవన్‌ కల్యాణ్‌కు కర్ణాటకలో ఘన స్వాగతం

జస్టిస్‌ గోపాలగౌడ అమృత మహాత్సవంలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.

Update: 2025-10-06 09:19 GMT

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాల గౌడ్‌ 80వ జన్మదినోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ఘన స్వాగతం లభించింది. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్‌ జిల్లా చింతామణి పట్టణంలో ఈ రోజు (అక్టోబర్‌ 6, 2025) జస్టిస్‌ వి. గోపాల గౌడ్‌ అమృత మహోత్సవం పేరుతో తన 80వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. జస్టిస్‌ గోపాల గౌడ్‌ , కోలార్‌ ఎమ్మెల్యే ఎం. మల్లేశ్‌ బాబు, కర్ణాటక శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. కృష్ణారెడ్డి, అనితా చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు డాక్టర్‌ ఎస్‌. యుధిష్ఠర్, లయోన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మార్గ్‌ అధ్యక్షుడు ఎన్‌. నవీన్‌ జి. కృష్ణ తదితరులు పవన్‌ కల్యాణ్‌కు బెంగుళూరు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు.

జస్టిస్‌ గోపాల గౌడ్‌ అమృత∙మహోత్సవం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆకర్షణ కేంద్రంగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోలార్, చిక్కబళ్లాపూర్, బెంగళూరు రూరల్‌ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నుంచి వేలాది మంది అభిమానులు చేరుకున్నారు. స్వతహాగా పవన్‌ కల్యాణ్‌కు కర్ణాటకలో అభిమానులు గణనీయంగానే ఉన్నారు. ఆయన తాజా సినిమా ‘ఓజీ’ సూపర్‌ హిట్‌గా నడుస్తున్న నేపథ్యంలో ఈ స్వాగతం మరింత ఉత్సాహవంతంగా జరిగింది.
అయితే కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రాంగణంలో భారీగా భద్రతా ఏర్పాటు చేపట్టారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసు బలగాలు మోహరించారు. పాస్‌ హోల్డర్లకు మాత్రమే లోపలికి అనుమతించారు, జస్టిస్‌ వి. గోపాల గౌడ్‌ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగాను, కర్ణటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను పని చేశారు. జస్టిస్‌ వి. గోపాల గౌడ్‌ తన జీవిత కాలంలో అందించిన న్యాయపరమైన సేవలను స్మరించుకునేందుకు నిర్వహిస్తున్నారు. మరో వైపు ఈ కార్యక్రమం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Tags:    

Similar News