తీరుమార్చుకున్న పరిటాల సునీత
గతంలో దూరమైన వారందరినీ దగ్గరకు తీసుకుంటూ ప్రచారం. తమ్ముళ్లను దూరంగా పెట్టిన సునీత. మరోసారి తప్పులు జరగకుండా చూస్తానని ప్రజలకు హామీ.
మాజీ మంత్రి, ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఈ దఫా ఎన్నికల ప్రచారాన్ని భిన్నంగా నిర్వహిస్తున్నారు. ప్రజల్లో పరిటాల కుటుంబానికి ఉన్న అభిమానంతో పరిటాల రవిని, ఆయన హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో పరిటాల రవి సతీమణి పరిటాల సునీతకు ఓట్లేసి ఆదరించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె మంత్రి అయ్యారు. దీంతో ఆమె ప్రజల బాగోగులు గురించి పట్టించుకోకుండా తన సోదరులైన బాలాజీ, మురళీలకు నియోజకవర్గంలోని మండలాలకు ఇన్‌చార్జిలుగా నియమించారు. దీంతో వారు ఇదే అదునుగా తీసుకొని డబ్బు సంపాదనకు అలవాటుపడ్డారు. వారి దయలేనిదే నియోజకవర్గంలో ఏ పనులు జరగనంత స్థాయికి వెళ్లారు. ఆఖరుకు విద్యార్థులు ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవాలన్నా వారు కరుణిస్తే తప్ప అధికారులు ఆ పత్రాలను జారీ చేసేవారు కాదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆరోపించారు. తమ్ముళ్ల దురాగతాలు చూసీ చూడనట్లు ఉండటం వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పినా సునీత తీరు మార్చుకోలేదు. ప్రజలు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.