Tirumala | భూమనా... పరకామణిలో చోరీ, తరువాత ఏమి జరిగిందో చెబుతారా..?

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-25 06:01 GMT

తిరుమల శ్రీవారి పరకామణి (హుండీ కానుకల లెక్కింపు)లో జరిగిన చోరీ అనంతరం జరిగిన వ్యవహారాలపై విచారణకు రావాలని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డికి ఏపీ సిఐడి ( AP CID) అధికారులు మంగళవారం ఉదయం నోటీసులు జారీ చేశారు.

సీఐడీ అధికారులు ఇచ్చిన నోెటీసుపై సంతకం చేస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి నగరం పద్మావతీపురంలోని భూమన నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పరకామణి చోరీ ఘటన నేపథ్యంలో నిందితుడు రవికుమార్ తో టీటీడీ పరకామణి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ (ఇటీవల ఆయన అనుమానాస్పద రీతిలో మరణించారు. తిరుపతి కోర్టులో రాజీ చేసుకున్నారు. దీనిపై తిరుమల కేంద్రంగా పనిచేసే జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఆదేశాలతో ఏపీ సీఐడీ డైరెక్టర్ జనరల్ (డీజీ) రవిశంకర్ అయ్యన్నార్ సారథ్యంలోని బృందం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ కేసులో 25 వ తేదీ మధ్యాహ్నం తిరుపతి పద్మావతీ అతిథి గృహంలో విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి నోటీసులు అందించారు.


గత నెల (అక్టోబర్) నుంచి సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సారధ్యంలోని బృదం తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు బృందం పరకామణి (హుండీ కానుకల లెక్కింపు కేంద్రం)లో పరిశీలించారు. అక్కడి రికార్డులు తనిఖీ చేశారు. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర రికార్డులు, చోరీ వ్యవహారంపై అధ్యయనం చేశారు. ఈ చోరీ తరువాత టీటీడీ ఏవీఎస్ఓ ( TTD Assistant Vigilance and Security Officer AVSO) సమర్పించిన విచారణ నివేదిక కూడా తీసుకున్నారు.

కేసు ఇదీ..
2023 సెప్టెంబర్ 9న తిరుమల శ్రీవారి పరకామణిలో జీయర్ మఠం ఏకాంగి (సూపరింటెండెంట్) పీవి. రవికుమార్ 920 డాలర్లు చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై ఆనాటి ఏవీఎస్ఓ వై. సతీష్ కుమార్ తిరుపతి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకున్నారు. దీనిపై పాలక మండలిలో కూడా తీర్మానం చేశారు. ఆ తరువాత రవికుమార్ ఆస్తులను టిటిడి కి స్వాధీనం చేసుకుంది.
పరకామణిలో చోరీకి పాల్పడిన నిందితుడు రవికుమార్ ఆయన భార్య శ్రీవారికి గిఫ్ట్ డీడ్ గా 14.43 కోట్ల ఆస్తి ఇవ్వడానికి టీటీడీకి లేఖ సమర్పించారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే 2023 జూన్ 19వ తేదీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సారధ్యంలోని పాలక మండలి ఆమోదం తెలిపింది. అంతకుముందు రోజే స్వాధీనం చేసుకున్నట్లు రికార్డులు కూడా బయటపడ్డాయి. దీంతో వైసీపీ సారధ్యంలోని పాలక మండలిపై అనేక ఆరోపణలు ముసురుకున్నాయి.
దర్యాప్తులో వేగం..
తిరుమల పరకామణిలో జరిగిన చోరీపై ఏపీ సీఐడీ విచారణలో వేగం పెంచింది. చోరీపై కేసు నమోదు చేయడం, ఆ తరువాత తిరుపతి లోక్ అదాలత్ కోర్టులో రాజీ చేసుకున్న మాజీ ఏవీఎస్ఓ వై.సతీష్ కుమార్ ను ఈ నెల నాల్గవ తేదీ సీఐడీ అధికారులు విచారణ చేశారు. మరోసారి 14వ తేదీ విచారణకు హాజరు కావడానికి గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి 13వ తేదీ రాత్రి సతీష్ కుమార్ బయలుదేరడం, మార్గమధ్యలోని కోమలి రైల్వే స్టేషన్ కు సమీపంలోని రైల్వే ట్రాక్ పై శవమై కనిపించడం కలకలం రేపింది. కొన్ని గంటల్లోనే ఈ వార్త దావానలంలా వ్యాపించింది.
ఈ సంఘటనపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఏమన్నారంటే..
"మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణం ప్రభుత్వం చేసిన హత్య" అని కరుణాకరరెడ్డి ఆరోపించారు. పరకామణి చోరీ కేసులో దర్యాప్తు అధికారులతో పాటు ఆనాటి టీటీడీ సీవీఎస్ఓ నరసింహ కిషోర్ కూడా దారుణంగా పరుష పదజాలంతో దూషించారని కరుణాకరరెడ్డి ఆరోపించారు.
"ఈ కేసులో తన పేరు చెప్పించడానికి ప్రయత్నించారనీ, ఈ ఒత్తిడి భరించలేని స్థితిలో సతీష్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు" అని కరుణాకరరెడ్డి ఆరోపించారు. కాగా, దర్యాప్తులోకి దిగిన అనంతపురం జిల్లా పోలీసులు
"మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ సహజ మరణం కాదు. హత్యకు గురైనట్లు నిర్ధారించి, ఆ మేరకు కేసు నమోదు చేశారు" ఇదిలాఉండగా,
తిరుమలలో పరకామణి చోరీ కేసులో వివరాలు రాబట్టడానికి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పరకామణి కేసులో టీటీడీ వీజీఓలు బాలిరెడ్డి, గిరిధర్ తోపాటు జీయర్ మఠం వేదపండితులను కూడా కొన్ని రోజుల కిందట సీఐడీ విచారణ చేసింది.
Tags:    

Similar News