నెక్ట్స్ విడదల రజిని వంతు
మాజీ మంత్రి విడదల రజినికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.;
By : The Federal
Update: 2025-07-19 12:46 GMT
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 20 ఆదివారం విచారణకు హాజరు కావాలని పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసులు జారీ చేసిన నిబంధనలను మీరారని, నిబంధనలను ఉల్లంఘించి మరీ జన సమీకరణ చేశారనే ఆరోపణల మీద మాజీ మంత్రి విడదల రజినిపై పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
పోయిన నెల 18న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో బలప్రదర్శనకు పాల్పడ్డారని, దీంతో ప్రజల ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వసం అయ్యాయని 113 మంది వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారికి కూడా నోటీసులు జారీ చేశారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నబత్తుని శివకుమార్‌లతో పాటు ఆ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల సుధీర్‌రెడ్డిలపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరు ఇప్పటికే పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజినికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
వరుస పోలీసు కేసులు, అరెస్టులతో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజంపేట సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి శనివారం సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మిథున్‌రెడ్డిని కూడా అరెస్టు చేస్తారనే చర్చ పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. మిథున్‌రెడ్డి తర్వాత విడదల రజినిని కూడా పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా కూడా కూటమి వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.